విద్యార్థులతో అమానుషంగా బేల కేజీబీవీ సిబ్బంది ప్రవర్తన

విద్యార్థులతో అమానుషంగా బేల కేజీబీవీ సిబ్బంది ప్రవర్తన
  • బేల కేజీబీవీ స్టూడెంట్స్​కు సిబ్బంది సమాధానం  
  • ఫుడ్ పాయిజన్ తో 28 మందికి అస్వస్థత
  • రిమ్స్ హాస్పిటల్ కు తరలింపు 

ఆదిలాబాద్, వెలుగు : ‘భోజనంలో పురుగులు వస్తే తీసేసి తినండి..మీ ఇంటికాడైతే తినరా.. కడుపునొస్తుందని నాటకాలు చేస్తున్నారా’ అంటూ బేల కేజీబీవీ సిబ్బంది.. విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారు. ఫలితంగా 28 మంది స్టూడెంట్స్​ అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. ఆదిలాబాద్​ జిల్లా బేల మండల కేంద్రంలోని కేజీబీవీలో మూడు రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని స్టూడెంట్లు సిబ్బందికి చెబుతూ వస్తున్నారు. అయినా వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆదివారం రాత్రి అన్నం, చికెన్ తిన్న 28 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. దీంతో సోమవారం ఉదయం వీరిని సిబ్బంది రిమ్స్​దవాఖానాకు తరలించారు.

మరో 10 మంది విద్యార్థులకు హాస్టల్​లోనే ప్రాథమిక చికిత్స చేశారు. అయితే కడుపునొప్పితో కింద పడిపోయే వారిని పట్టించుకోలేదని, సీరియస్ గా ఉంటేనే హాస్పిటల్ కు వెళ్లండని, కొందరు కావాలనే డ్రామాలు చేస్తున్నారంటూ సిబ్బంది మాట్లాడారని విద్యార్థులు వాపోయారు. కాగా, విషయం తెలుసుకుని కేజీబీవీకి వచ్చిన డీఈఓ ప్రణిత ఘటనపై ఆరా తీశారు. విచారణ చేపడుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.