రెండో వన్డేలో టీమిండియా ఓటమి.. 4 వికెట్ల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా

రెండో వన్డేలో టీమిండియా ఓటమి.. 4 వికెట్ల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా
  • 358 రన్స్‌‌.. సరిపోలే
  • చెలరేగిన మార్‌‌క్రమ్‌‌, బ్రీట్జ్‌‌కే, బ్రేవిస్‌‌.. కోహ్లీ, రుతురాజ్‌‌ సెంచరీలు వృథా

రాయ్‌‌పూర్‌‌: బ్యాటర్లు రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (83 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 105), విరాట్‌‌ కోహ్లీ (93 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 102) సెంచరీలతో దంచికొట్టిన చోట.. టీమిండియా బౌలర్లు అట్టర్‌‌ ఫ్లాఫ్‌‌ అయ్యారు. సౌతాఫ్రికా బ్యాటర్లు ఐడెన్‌‌ మార్‌‌క్రమ్‌‌ (98 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 110), మాథ్యూ బ్రీట్జ్‌‌కే (68), డేవ్లాడ్‌‌ బ్రేవిస్‌‌ (54) ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌కు అడ్డుకట్ట వేయలేక భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. 

ఫలితంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో సఫారీల చేతిలో ఓడింది. దాంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ 1–1తో సమమైంది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 358/5 స్కోరు చేసింది. కేఎల్‌‌ రాహుల్‌‌ (43 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 66 నాటౌట్‌‌) మెరుగ్గా ఆడాడు. తర్వాత సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 362/6 స్కోరు చేసి నెగ్గింది. మార్‌‌క్రమ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే శనివారం విశాఖపట్నంలో జరుగుతుంది.
 
కోహ్లీ @ 53

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు రోహిత్‌‌ శర్మ (14), యశస్వి జైస్వాల్‌‌ (22) మెరుగైన ఆరంభం ఇచ్చే క్రమంలో వికెట్లు చేజార్చుకున్నారు. దీనికి తోడు పిచ్‌‌ మందకొడిగా ఉండటంతో సఫారీ బౌలర్లు ఎక్కువగా వైడ్లు వేయడంతో హిట్‌‌మ్యాన్‌‌ లయ దెబ్బతిన్నది.నాండ్రీ బర్గర్‌‌ (1/43) వేసిన ఐదో ఓవర్‌‌లో తొలి మూడు బాల్స్‌‌ను రోహిత్‌‌ ఫోర్లుగా మల్చి జోరు చూపెట్టాడు. అదే క్రమంలో ఆఫ్‌‌ స్టంప్‌‌ మీదుగా స్వింగ్‌‌ అయిన బాల్‌‌ను అనూహ్యంగా టచ్‌‌ చేసి కీపర్‌‌ డికాక్‌‌కు చేతికి చిక్కాడు.

తొలి వికెట్‌‌కు 40 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. రెండో ఎండ్‌‌లో జైస్వాల్‌‌ కూడా రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌తో టచ్‌‌లో కనిపించినా.. యాన్సెన్‌‌ (2/63) ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌ ఆడటంలో ఫెయిలయ్యాడు. 10వ ఓవర్‌‌లో మిడిల్‌‌ పిచ్‌‌ నుంచి బౌన్స్ అయిన బాల్‌‌ను ఫుల్‌‌షాట్‌‌ కొట్టబోయి స్క్వేర్‌‌ లెగ్‌‌లో బాష్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. ఫలితంగా ఇండియా 62/2తో నిలిచింది. 

ఇక్కడి నుంచి రుతురాజ్‌‌తో కలిసి కోహ్లీ సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడారు. మిడిలార్డర్‌‌లో పెద్దగా బ్యాటింగ్‌‌ అనుభవం లేని రుతురాజ్‌‌కు విలువైన సలహాలు ఇస్తూ ఈజీగా స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసి రన్స్‌‌ రాబట్టాడు. సింగిల్స్‌‌ను డబుల్స్‌‌గా మార్చాడు. అవసరమైనప్పుడు బౌండ్రీలు బాదారు. ఈ ఇద్దర్ని విడదీసేందుకు కెప్టెన్‌‌ బవూమ బౌలర్లను ఎంత మార్చినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. దీంతో రుతురాజ్‌‌ 52, కోహ్లీ 47 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీలు చేశారు. 

ఫిఫ్టీతో ఆత్మ విశ్వాసాన్ని పెంచుకున్న రుతురాజ్‌‌ క్రమంగా బ్యాట్‌‌ ఝుళిపించాడు. కేశవ్‌‌ మహారాజ్‌‌ వేసిన 28వ ఓవర్‌‌లో సిక్స్‌‌, రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 34వ ఓవర్‌‌లో 77 బాల్స్‌‌లోనే సెంచరీ అందుకున్నాడు. కానీ 36వ ఓవర్‌‌లో యాన్సెన్‌‌ వేసిన యాంగిల్‌‌ బాల్‌‌కు షాట్‌‌ కొట్టిన రుతురాజ్‌‌ డీప్‌‌ ఫైన్‌‌ లెగ్‌‌లో డి జోర్జికి దొరికాడు. 

మూడో వికెట్‌‌కు 195 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 90 బాల్స్‌‌లో సెంచరీ అందుకున్న కోహ్లీ వన్డే కెరీర్‌‌లో 53వ సారి ట్రిపుల్‌‌ మార్క్‌‌ నమోదు చేశాడు. కానీ మరో మూడు ఓవర్ల తర్వాత ఎంగిడికి వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఆ వెంటనే వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (1) ఔటైనా..  రాహుల్‌‌, జడేజా (24 నాటౌట్) వేగంగా ఆడి ఆరో వికెట్‌‌కు 69 రన్స్‌‌ జోడించి భారీ స్కోరు అందించారు. 

బౌలర్లు ఫెయిల్‌‌..

ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికాకు ఓపెనర్‌‌ మార్‌‌క్రమ్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. డికాక్‌‌ (8) ఐదో ఓవర్‌‌లోనే వెనుదిరిగినా.. కెప్టెన్‌‌ బవూమ (46)తో కలిసి నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరు కలిసి ఇండియా బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కొని పవర్‌‌ప్లేలో 51/1 స్కోరు చేశారు. ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత మార్‌‌క్రమ్‌‌ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని నాలుగు సిక్సర్లు బాదాడు. 

15 ఓవర్లు ఈ ఇద్దరు వికెట్‌‌ ఇవ్వకుండా ఆడటంతో స్కోరు బోర్డు గాడిలో పడింది. అయితే 21వ ఓవర్‌‌లో ప్రసిధ్‌‌ కృష్ణ (2/85) షార్ట్‌‌ బాల్‌‌తో బవూమాను ఔట్‌‌ చేశాడు. రెండో వికెట్‌‌కు 101 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ దశలో బ్రీట్జ్‌‌కే  మెరుపు ఇన్నింగ్స్‌‌ ఆడగా.. మార్‌‌క్రమ్‌‌ దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలో 88 బాల్స్‌‌లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే మూడో వికెట్‌‌కు 50 రన్స్‌‌ జత చేసిన తర్వాత హర్షిత్‌‌ రాణా (1/70).. మార్‌‌క్రమ్‌‌ను పెవిలియన్‌‌కు పంపాడు. 

బ్రీట్జ్‌‌కేతో జతకట్టిన  బ్రేవిస్‌‌ టీ20 తరహాలో బ్యాటింగ్‌‌ చేశాడు. ఈ ఇద్దరి జోరును ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్‌‌ కాలేదు. దాంతో రన్‌‌రేట్‌‌ వాయువేగంతో దూసుకుపోయింది. బ్రీట్జ్‌‌కే 49, బ్రేవిస్‌‌ 33 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ అందుకున్నారు. అయితే మూడు ఓవర్ల వ్యవధిలో ఈ ఇద్దర్ని ఔట్‌‌ చేసినా.. సౌతాఫ్రికా 317/5తో విజయం దిశగా దూసుకెళ్లింది. మధ్యలో టోనీ డి జోర్జి (17) రిటైర్డ్‌‌ హర్ట్‌‌ కాగా, యాన్సెన్‌‌ (2) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. అయినా చివరి ఐదు ఓవర్లలో 27 రన్స్ కావాల్సిన దశలో కార్బిన్‌‌ బాష్‌‌ (29 నాటౌట్‌‌), కేశవ్‌‌ మహారాజ్‌‌ (10 నాటౌట్‌‌) మరో నాలుగు బాల్స్‌‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. 

సంక్షిప్త స్కోర్లు

  • ఇండియా: 50 ఓవర్లలో 358/5 (రుతురాజ్‌‌ 105, కోహ్లీ 102, రాహుల్‌‌ 66*, యాన్సెన్‌‌ 2/63), 
  • సౌతాఫ్రికా: 49.2 ఓవర్లలో 362/6 (మార్‌‌క్రమ్‌‌ 110, బ్రీట్జ్‌‌కే 68, బ్రేవిస్‌‌ 54, అర్ష్‌‌దీప్‌‌ 2/54). 

32 వన్డేల్లో అత్యధిక సార్లు 150కి పైగా రన్స్‌‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి ప్లేయర్‌‌గా కోహ్లీ (32) నిలిచాడు. ఈ క్రమంలో సచిన్‌‌ (31) రికార్డును బ్రేక్‌‌ చేశాడు.