ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగుతం

ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగుతం

యాదగిరిగుట్ట, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కింద ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామస్తులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని నిర్వాసితులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ లప్పనాయక్ తండా గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రిజర్వాయర్ కట్టపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ.. పరిహారం, పునరావాసం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పునరావాసం కింద దాతారుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 294లో ఒక్కో నిర్వాసితుడికి 200 గజాల చొప్పున కేటాయించి, ఇళ్ల నిర్మాణం కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.7.61 లక్షలు ఇస్తామని ఆర్డర్స్ జారీ చేసిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఆ దిశగా పనులు మొదలుపెట్టలేదన్నారు. రిజర్వాయర్ పనులు పూర్తికావస్తున్నా పరిహారం, పునరావాసం విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పునరావాసం, పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనావత్ బుజ్జి శంకర్ నాయక్, ఉప సర్పంచ్ మంక్యా నాయక్, మాజీ సర్పంచ్ గాశీరాం, నిర్వాసితులు పాల్గొన్నారు