ఇంజక్షన్‌‌ వికటించి మహిళ మృతి.. రాస్తారోకోకు దిగిన బంధువులు

ఇంజక్షన్‌‌ వికటించి మహిళ మృతి.. రాస్తారోకోకు దిగిన బంధువులు

పాలకుర్తి (దేవరుప్పుల), వెలుగు : ఆర్‌‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌‌ వికటించడంతో ఓ మహిళ చనిపోయింది. దీంతో మృతురాలి ఫ్యామిలీకి న్యాయం చేయాలంటూ బంధువులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పలలో గురువారం జరిగింది. దేవరుప్పుల మండలం ధర్మాపురం పరిధిలోని పడమటితండాకు చెందిన జాటోతు లక్ష్మి (30)కి జ్వరం రావడంతో కొడకండ్ల మండలం రామన్నగూడెంలోని ఓ ఆర్‌‌ఎంపీ వద్దకు వెళ్లింది. అతడు ఇంజక్షన్‌‌ చేయడంతో వికటించింది. ఆమెను జనగామ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతదేహంతో రామన్నగూడెంలోని ఆర్‌‌ఎంపీ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మృతురాలి ఫ్యామిలీకి న్యాయం చేయాలంటూ జనగామ – సూర్యాపేట హైవేపై రాస్తారోకోకు దిగారు.

సుమారు 3 గంటల పాటు ధర్నా చేయడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే టైంలో అటుగా వెళ్తున్న డోర్నకల్‌‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌ కారును ఆందోళనకారులు అడ్డుకొని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌‌ చేశారు. ఆయన పోలీసులతో మాట్లాడి, ఆందోళనకారులకు నచ్చజెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాలకుర్తి సీఐ విశ్వేశ్వర్‌‌  ఆందోళనకారులను సముదాయించి, చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.