
పద్మారావునగర్, వెలుగు: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గాంధీ దవాఖానను మళ్లీ కరోనా ట్రీట్మెంట్కే పరిమితం చేసేలా వైద్య శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నుంచి కొత్తగా ఇన్‌పేషెంట్ల అడ్మిషన్లను బంద్ పెడుతూ గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎమర్జెన్సీ, ఓపీ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉన్న వారిని త్వరగా డిశ్చార్జి చేయాలని సూచించారు. ఇప్పటికే శాంక్షన్ అయినవారితో పాటు సిబ్బంది అందరికీ సెలవులను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, రాబోయే 10 రోజుల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలోనే అధికారులు.. గాంధీని పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నాన్ కొవిడ్ సేవలను నిలిపేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండేండ్లలో రెండు సార్లు గాంధీలో నాన్ కొవిడ్ సేవలను నిలిపేశారు. ఈ నిర్ణయంతో పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గాంధీకి బదులు గచ్చిబౌలి టిమ్స్ ను కరోనా ఆస్పత్రిగా మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.