- వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్‌లు, 136 మున్సిపాలిటీలను గెలిచినం: కేటీఆర్
- ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎలక్షన్‌కు వెళ్లాలి
- తాండూరు నియోజకవర్గ సర్పంచులతో మీటింగ్ అనంతరం చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను ఫెయిల్ కాలేదని కేటీఆర్ అన్నారు. తాను ఆ బాధ్యతలు చేపట్టాకే 32 జిల్లా పరిషత్‌లు, 136 మున్సిపాలిటీలను గెలిచామని తెలిపారు. రేవంత్ సీఎం అయ్యాక సొంత పార్లమెంట్స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే.. సీఎం రేవంత్‌రెడ్డితో ఫుట్‌బాల్ ఆడుకుంటానని అన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తాండూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ సర్పంచులతో సమావేశం అనంతరం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. తాను ఐరన్ లెగ్కాదని, రేవంత్, రాహుల్‌గాంధీలే ఐరన్ లెగ్‌లు అని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించరని, మొదట మున్సిపల్ ఎన్నికలు పెడ్తారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 66 శాతం వచ్చింది నిజమైతే వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.
స్పీకర్ తీర్పు విడ్డూరంగా ఉంది..
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చొని బీఆర్ఎస్‌లో ఉన్నామని చెప్పడం.. బురదలో కూర్చొని పవిత్రంగా ఉన్నట్లు మాట్లాడడమేనని అన్నారు. కాంగ్రెస్‌లో చేరినట్లు వారు బహిరంగంగా చెబితే.. స్పీకర్ మాత్రం ఆధారాలు లేవని విడ్డూరంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదన్నారు. గ్రేటర్‌ను హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు కార్పోరేషన్లుగా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి కుంటుపడిందని కేటీఆర్ విమర్శించారు.
