గెలుస్తమా..  ఓడుతమా?..ఎమ్మెల్యేల సొంత సర్వేలు

గెలుస్తమా..  ఓడుతమా?..ఎమ్మెల్యేల సొంత సర్వేలు
  • జనం నాడి తెలుసుకునేందుకు 
  • మంత్రులు, ఎమ్మెల్యేల సొంత సర్వేలు
  •  సొంత నియోజకవర్గంతో పాటు పక్క సెగ్మెంట్లలోనూ పరిస్థితిపై ఆరా
  • తేడా వస్తే ఇంకో స్థానం నుంచి పోటీ చేసేందుకు వ్యూహం

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో మంత్రులు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సర్వేలపై ఫోకస్​ పెట్టారు. పాలనపై తమ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడంతో పాటు పక్క నియోజకవర్గాల్లో పరిస్థితి ఎట్లా ఉందో ఆరా తీస్తున్నారు. పరిస్థితులు అనుకూలించకపోయినా.. ఏదైనా తేడా వచ్చినా.. సీటు మార్చుకునేందుకు ఇప్పటి నుంచే  ప్లాన్​ చేసుకుంటున్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు  ఇంకా ఏడాదికి పైగా టైమ్​ ఉంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కడం, పీకే టీంతో కేసీఆర్​ సర్వే చేయిస్తుండటం, ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని ప్రచారం జరుగుతుండటంతో  సొంతంగా సర్వేలు చేయించుకొని, ప్రజల నాడి తెలుసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. వేగంగా మారుతున్న సమీకరణలు, ప్రతిపక్షాలు పుంజుకోవడంతో ఇటీవల రెండు సర్వేలు చేయించుకున్నట్లు ఓ మంత్రి మీడియా చిట్​చాట్​లో చెప్పారు. తన నియోజకవర్గంలోనే కాకుండా, ఉమ్మడి జిల్లా అంతా సర్వే టీంలు పనిచేశాయని, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిపై రిపోర్ట్​ తెప్పించుకున్నట్లు తెలిపారు.  తాను ఒక్కడినే కాదని, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఎవరికి వారు అనుకూలతలు, ప్రతికూలతలపై  సర్వేలు చేయించుకుంటున్నారని  చెప్పుకొచ్చారు.
 

గ్రామాలు, కులాల వారీగా..!
గ్రామాలు, కులాల వారీగా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలు చేయించుకుంటున్నారు. ‘‘గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి?  అందులో నుంచి పార్టీకి, క్యాండిడేట్​కు కులాల వారీగా ఎన్ని ఓట్లు పడుతున్నాయి?” అనే వివరాలు తెప్పించుకుంటున్నారు. ఏ కులం నుంచి తక్కువ ఓట్లు వస్తున్నాయో తెలుసుకొని.. ఆ కులాల పెద్దలను సెపరేట్​గా పిలిపించుకుని బుజ్జగించడం, అవసరమైన పనులు చేసిపెట్టడం వంటివి చేస్తున్నారు. కాస్త నెగిటివ్​ టాక్​ పోతుందని భావిస్తున్నారు.