ఎన్‌‌హెచ్‌‌ఆర్సీకి తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం లేఖ

ఎన్‌‌హెచ్‌‌ఆర్సీకి తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం లేఖ
  • ఎన్‌‌హెచ్‌‌ఆర్సీకి దొంతుల లక్ష్మీనారాయణ కంప్లైంట్‌‌
  • హైకోర్టు చీఫ్ జస్టిస్ కూ లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌‌ రిజర్వాయర్‌‌ ముంపు బాధితుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలని నేషనల్‌‌ హ్యూమన్‌‌ రైట్స్‌‌ కమిషన్‌‌ (ఎన్‌‌హెచ్‌‌ఆర్సీ)కి తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం కన్వీనర్‌‌, రిటైర్డ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ కంప్లైంట్‌‌ చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా రీడిజైన్‌‌ చేశారని, పాత డిజైన్‌‌ ప్రకారం1.50 టీఎంసీలు ఉండాల్సిన మల్లన్నసాగర్‌‌ (తడ్కపల్లి)ని 50 టీఎంసీలకు పెంచారని తెలిపారు. దీంతో14 గ్రామాల్లో 18 వేల ఎకరాల పట్టా భూములు, 3 వేల ఎకరాల అటవీ భూములు ముంపునకు గురయ్యాయన్నారు. ఈ రిజర్వాయర్‌‌తో 5 వేల కుటుంబాలు నిర్వాసితులయ్యాయని పేర్కొన్నారు. రిజర్వాయర్‌‌ కెపాసిటీ పెంపును నిరసిస్తూ ముంపు గ్రామం వేముల ఘాట్‌‌లో 960 రోజులు రిలే నిరాహార దీక్షలు జరిగాయన్నారు. నిర్వాసితులకు సరైన ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ, పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేముల ఘాట్‌‌ రైతు తూటుకూరి మల్లారెడ్డి (70) 2021 జూన్‌‌ 17న అర్ధరాత్రి తన ఇంట్లోని దూలాలతో చితిపేర్చుకొని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వడం లేదంటూ ‘వీ6 వెలుగు’లో డిసెంబర్‌‌ 27న ప్రచురించిన స్టోరీని కంప్లైంట్‌‌కు జత చేశారు. పరిహారం ఇవ్వడం లేదని అదే గ్రామానికి చెందిన మంగారి బాలవ్వ (80), గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఎల్లయ్య, బద్దం రాజు, బస్వాపూర్ నిర్వాసితుడు పిన్నం సతీశ్‌‌ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. వీరి ఆత్మహత్యలపై విచారణ జరిపించాలని ఎన్‌‌హెచ్‌‌ఆర్సీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే లేఖను రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌‌చంద్ర శర్మకు కూడా పంపారు.