భైంసా కేజీబీవీలో దారుణం

భైంసా కేజీబీవీలో దారుణం
  • స్టూడెంట్స్‌‌కు వాంతులు, విరేచనాలు
  • స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
  • మహబూబ్‌‌నగర్‌‌‌‌లో పురుగుల అన్నం పెట్టడంపై స్టూడెంట్ల ధర్నా

భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఐదు రోజులుగా పురుగుల అన్నం వండుతున్నారు. ప్రిన్సిపాల్‌‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చాలా మంది స్టూడెంట్స్ అన్నం మానేసి బయట స్నాక్స్​ తిన్నారు. వాటితో కడుపు నిండక, నీరసించి సోమవారం పది మంది స్టూడెంట్స్ కండ్లు తిరిగి పడిపోయారు. ఆకలికి తట్టుకోలేక పురుగుల అన్నం తిన్న మరికొందరు స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బయటికి రాకుండా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓ ప్రైవేట్​ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా, విషయం తెలుసుకున్న పేరెంట్స్​ ఆందోళనకు దిగారు.

సర్కారు నుంచే పురుగుల బియ్యం
సివిల్​సప్లయ్స్ శాఖ నుంచి స్కూళ్లకు వస్తున్న బియ్యంలో పురుగులు ఉంటున్నాయి. వాటిని అలాగే వండుతున్నారనే ఫిర్యాదులున్నాయి. భైంసా కేజీబీవీలో 185 మంది స్టూడెంట్స్​చదువుతున్నారు. ఇక్కడికి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చిన బియ్యంలో పురుగులు ఉంటున్నాయి. ముందుగా బియ్యాన్ని కడిగి వండాల్సిన మెస్ నిర్వాహకులు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అట్లనే వండుతున్నారని స్టూడెంట్స్ చెప్తున్నారు. ఐదు రోజులుగా అన్నంలో పురుగులు కనిపిస్తున్నాయని, అందుకే చాలామంది తినడం లేదని అంటున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపాల్ స్వప్నరాణికి ఐదు రోజుల కిందే పిల్లలు ఫిర్యాదు చేశారు. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో చాలామంది విద్యార్థులు అన్నం మానేసి బయట స్నాక్స్​కొని తింటున్నారు. స్నాక్స్ సరిపడా తెచ్చుకోలేనివాళ్లు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వీరిలో పది మంది సోమవారం నీరసంతో కళ్లు తిరిగి పడిపోయారు. బయట స్నాక్స్​ కొనే స్థోమత లేనివాళ్లు తప్పని సరి పరిస్థితుల్లో పురుగుల అన్నమే తింటున్నారు. ఇలా పురుగుల అన్నం తిన్న 15 మంది స్టూడెంట్స్​కు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ప్రిన్సిపాల్ స్వప్నరాణి.. నీరసంతో పడిపోయిన పిల్లలకు ఓఆర్ఎస్​ప్యాకెట్లు అందించారు. అప్పటికీ కోలుకోని పిల్లలను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలియడంతో ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలదీశారు. ‘మీ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మాకు అక్కర్లేదు’ అంటూ పిల్లల్ని ఇండ్లకు తీసుకెళ్లారు. కొందరు పేరెంట్స్ స్కూల్ ముందు ఆందోళన చేశారు. ‘మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడ్తున్నారా?’’ అంటూ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి​ సబిత ఆరా
కేజీబీవీ ఘటనపై విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీకి ఫోన్ చేసి ఆరా తీశారు. నివేదిక ఇవ్వాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో కలెక్టర్​ఆదేశాల మేరకు డీఈవో రవీందర్ రెడ్డి, ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంఈవో సుభాష్, సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీదేవి.. భైంసా చేరుకున్నారు. జరిగిన ఘటనపై స్టూడెంట్ల నుంచి ఆరా తీశారు. తమకు ఐదు రోజులుగా పురుగుల అన్నం పెడ్తున్నారని , తినలేక పస్తులున్నామని స్టూడెంట్స్ వారికి ఫిర్యాదు చేశారు.

పాలమూరులోనూ పురుగుల అన్నం
మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ టౌన్, వెలుగు: మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం, నీళ్ల చారు పెట్టినందుకు స్టూడెంట్స్ ప్లేట్లతో రోడ్డుపై భైఠాయించి ధర్నా చేశారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి జెడ్పీహెచ్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మధ్యాహ్న భోజనం ప్రతి రోజు నాసిరకంగా ఉండడం వల్ల తినలేకపోతున్నామని స్టూడెంట్స్ చెప్పారు. మధ్యాహ్న భోజనం గురించి పట్టించుకోని స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ‘నాసిరకమైన భోజనం మాకొద్దు’.. ‘డీఈఓ, కలెక్టర్ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ అక్కడకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనంతోపాటు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ అక్కడి నుంచి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు.

నాలుగు రోజుల నుంచి తింటలే
మా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు రోజులుగా పురుగుల అన్నం పెడ్తున్నరు. మొదటి రోజు అన్నంలో పురుగులు చూసి పడేసిన. తెల్లవారి కూడా పురుగులు వచ్చాయి. దీంతో 4రోజులుగా ఖాళీ కడుపుతో ఉంటున్న. సోమవారం కండ్లు తిరిగి కింది పడిపోయిన. ప్రిన్సిపాల్ మేడంకు చెప్పినా పట్టించుకోలేదు.
- ప్రణవి, స్టూడెంట్

ఫిర్యాదు చేసినా పట్టించుకోలే
మా స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగైదు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, ఇతర ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినం. 2న డీఈవోకు కంప్లైం ట్ చేసినా పట్టించుకోలే. స్నాక్స్ కొని కడుపు నింపుకున్నరు. నా దగ్గర డబ్బుల్లేక పురుగుల అన్నం తింటే వాంతులైనయ్​..
‌‌‌‌‌‌‌‌- ఆకాంక్ష, స్టూడెంట్

చర్యలు తీసుకుంటం
భైంసా కేజీబీవీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పురుగుల అన్నం విషయం మా దృష్టికి వచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో వెంటనే స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజిట్ చేసినం. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చిన బియ్యంలోనే పురుగులున్నట్లు తేలింది. వెంటనే వేరే బియ్యం తెప్పించినం. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.
- డీఈవో రవీందర్ రెడ్డి