రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ స్కూల్లో శనివారం ఫుడ్ పాయిజన్ జరిగింది. రాగిజావ తాగిన ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్లో సుమారు 140 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. ఉదయం వండిన రాగిజావ తాగిన విజయ్, సిద్దు, అరవింద్, ప్రభాస్, విష్ణు, చరణ్ అనే విద్యార్థులు జావలో పురుగులు ఉన్నట్లు గమనించి వంట సిబ్బందికి తెలిపారు.
వెంటనే మిగిలిన జావను పారబోశారు. అనంతరం ఆరుగురికి వాంతులు కావడంతో హెచ్ఎం వారిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. డీఈఓ విజయ స్కూల్కు చేరుకుని విచారణ చేపట్టారు.
