ఆగస్టు మొదటి వారంలోగా పనులు పూర్తి చేయాలి: మెదక్​ కలెక్టర్ రాజర్షి షా

ఆగస్టు మొదటి వారంలోగా పనులు పూర్తి చేయాలి:   మెదక్​ కలెక్టర్ రాజర్షి షా

వెల్దుర్తి/కొల్చారం, వెలుగు : మన ఊరు మన బడి పథకం కింద స్కూళ్లలో చేపట్టిన పనులు ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని మెదక్​కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. శుక్రవారం వెల్దుర్తి మండలంలోని కుకునూర్, వెల్దుర్తి ప్రభుత్వ బడుల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో చేస్తున్న పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. 

వెల్దుర్తిలోని జడ్పీహెచ్​ఎస్​లో రెండు, ప్రాథమిక పాఠశాలలో మూడు గదులు శిథిలమయ్యాయని,  వాటిని వెంటనే కూల్చి కొత్త భవనాలు కట్టాలన్నారు. వెల్దుర్తి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అలాట్​ చేసినప్పటికీ చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చాలని కొందరు లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందిస్తూ సమస్యలను పరిష్కరించాలని పంచాయతీరాజ్​ఈఈ సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. వెల్దుర్తి పంచాయతీకి రెండు పల్లె దవాఖానాలు మంజూరు అయ్యాయని, కాంట్రాక్టర్లు నిర్మాణాలు త్వరగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంటఅడిషనల్​ కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఈఓ రాధా కిషన్, ఎంపీడీవో వెంకటలక్ష్మి, హెచ్ఎం సాంబయ్య ఉన్నారు.

కొంగోడ్ సందర్శన 

కొల్చారం మండలంలోని కొంగోడ్ గ్రామాన్ని కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్​  కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం సందర్శించారు. స్వచ్ఛ భారత్ మిషన్​,  స్వచ్ఛ సర్వేక్షణ్​ మిషన్ లో భాగంగా కొంగోడ్ గ్రామాన్ని నామినేట్​చేసినట్టు తెలిపారు. గ్రామంలో మురుగు నీటి వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు 272 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నట్లు డీపీఓ సాయిబాబా, ఎంపీడీఓ గణేశ్ రెడ్డి వివరించారు. తడిపొడి చెత్త వేరు చేసే విధానంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.