- ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ముదిగొండ, వెలుగు : ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం భవనాలు కాదు... అవి రేపటి తరాలను తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలు’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు, ముదిగొండ మండలాల్లో ఆదివారం పర్యటించి సబ్‌స్టేషన్లు, పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బోనకల్లు మండలం లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విద్యపై ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్‌తరాల అభివృద్ధి కోసం చేసే పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.
విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, పనులను స్పీడ్‌గా చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తే విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
- రైతుల మోటార్లకు మీటర్లంటూ తప్పుడు ప్రచారం
ఖమ్మం టౌన్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెడుతుందంటూ కొన్ని పార్టీల నాయకులు అసత్యప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఆదివారం ఖమ్మంలోని పాకబండ వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రైతులకు మీటర్లు పెట్టకుండా ఇలాగే ఉచిత విద్యుత్ అందిస్తే.. తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పి, ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటారా ? అని సవాల్ చేశారు. విద్యుత్ అవసరాలు భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్‌బాబా, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
