
- హైకమాండ్ వద్ద మెప్పు కోసం నేతల పాకులాట
- నేడు కొత్తగూడెం రానున్న పరిశీలకులు
ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీ పీఠం కోసం రేసు మొదలైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకోవడమే లక్ష్యంగా, హైకమాండ్ మెప్పు పొందేందుకు పలువురు నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరులు ఈసారి పార్టీలో ముఖ్య పదవులపై కన్నేశారు. తమకు అవకాశం కల్పించాలంటూ దరఖాస్తుతో పాటు బయోడేటా కాపీని ఏఐసీసీ అబ్జర్వర్లకు అందజేస్తున్నారు.
నిన్న, మొన్నటి వరకు జిల్లాలో వేర్వేరు స్థాయిల్లో పార్టీ కోసం పనిచేసిన వారు, ప్రజా ప్రతినిధులుగా అనుభవం ఉన్న వారు, నామినేటెడ్ పదవులు పొందినవారు, నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ వారు కూడా ఆశావహుల్లో ఉన్నారు. జడ్పీ చైర్మన్ లాంటి పదవులు ఆశించి, రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో నిరాశకు గురైన లీడర్ ఒకరు జిల్లా కాంగ్రెస్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్లు రెండు, మూడ్రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఆశావహులతో మాట్లాడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో ఆశావహులు వీరే!
ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరులు ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నూతి సత్యనారాయణ గౌడ్, మధిర నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గం నుంచి వైరా మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి రేస్లోఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి కార్పొరేటర్ కమర్తపు మురళి ఇప్పటికే దరఖాస్తు చేశారు.
ఈ ఎన్నికల సమన్వయకర్తలుగా ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్రన్, పీసీసీ కో ఆర్డినేటర్స్ శ్రవణ్ కుమార్ రెడ్డి, రవళిరెడ్డి, రాజీవ్ రెడ్డి, చెక్కిలం రాజేశ్వరరావు ఇప్పటికే ఖమ్మం వచ్చారు. ఖమ్మం నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఇప్పటికే పూర్తికాగా, మంగళవారం పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా జిల్లాలోని ముగ్గురు మంత్రుల అనుచరులు, ఎంపీ రేణుకాచౌదరి ఫాలోవర్స్ కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
కష్టపడే వారికే ఇవ్వాలి..
పార్టీని నమ్ముకొని, పార్టీ కోసమే కష్టపడే వారిని గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేలా పరిశీలకులతో పాటు హైకమాండ్చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలు కోరుతున్నారు. దరఖాస్తులు ఇవ్వకున్నా పార్టీలోని నాయకులు, కార్యకర్తలను కో ఆర్డినేషన్ చేసుకునే వారిని గుర్తించి డీసీసీ ఇవ్వాలని పేర్కొంటున్నారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఇదీ..!
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనూ డిప్యూటీ సీఎం భట్టి , మంత్రి పొంగులేటి వర్గాలకు చెందిన నేతలే ప్రధానంగా డీసీసీ పోటీలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి నేడు కొత్తగూడెంలో పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగనుంది. ఏఐసీసీ సెక్రటరీ జాన్సన్ అబ్రహం పరిశీలకుడిగా రానున్నారు. ఆయనతో పాటు టీపీసీసీకి చెందిన అబ్జర్వర్లు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ జహి, ఈడుపుగంటి సుబ్బారావు, ఎ. సంజీవ్ ముదిరాజ్, వైసీ సాగరిక మీటింగ్లో పాల్గొని ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు.
కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు పొదెం వీరయ్యతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, నేతలు కొత్వాల శ్రీనివాస్, కోనేరు సత్యనారాయణ, తుళ్లూరి బ్రహ్మయ్య, బాలశౌరి, కంచర్ల చంద్రశేఖర్, వూకంటి గోపాలరావు, చింతలపూడి రాజశేఖర్, దేవీ ప్రసన్న, ఎడవల్లి కృష్ణ, బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేశ్, జూపల్లి రమేశ్ ప్రధానంగా పోటీలో ఉన్నారు.