
దసరా సెలవుల్లో క్లాసులు పెట్టడమే కారణం
రోజుకు రూ.లక్ష చొప్పున పెనాల్టీ వేసిన ఇంటర్‌బోర్డు
రూల్స్‌ను పట్టించుకోకుండా దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహించిన 50 ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియెట్ బోర్డు ఫైన్ వేసింది. ఒక్కో రోజుకు రూ.లక్ష చొప్పున పెనాల్టీ చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. సదరు కాలేజీలు శనివారం లోపు ఫైన్ కట్టకుంటే గుర్తింపు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.
రూల్స్ పాటించకుండా క్లాసులు
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9 వరకు ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సెలవులను అక్టోబర్ 20 వరకూ పొడిగించారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు సెలవు రోజుల్లోనూ తరగతులు కొనసాగించాయి. దీనిపై స్టూడెంట్ యూనియన్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. రూల్స్ పట్టించుకోని కాలేజీలకు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు(డీఐఈవో) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటికి కాలేజీ మేనేజ్మెంట్లు రిప్లే ఇవ్వలేదని తెలిసింది.
రూల్స్ పాటించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయింది. రాష్ట్రంలో 50 జూనియర్ కాలేజీలకు ఫైన్ వేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ 50 కాలేజీల్లో రెండు, మూడు మినహా మిగిలినవన్నీ శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే. అన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. 50 కాలేజీలకు ఫైన్ వేయగా, ఒక కాలేజీ ఏడు రోజులు క్లాసులు నిర్వహించినందుకు అత్యధికంగా రూ.ఏడు లక్షల పెనాల్టీ వేశామని ఒమర్ జలీల్ తెలిపారు. గడువులోపు ఫైన్ చెల్లించకుంటే, రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.