ఐదేండ్ల తర్వాత ఇంటర్​ బోర్డు మీటింగ్

ఐదేండ్ల తర్వాత ఇంటర్​ బోర్డు మీటింగ్
  • ఐదేండ్ల తర్వాత ఇంటర్​ బోర్డు మీటింగ్
  • ఎజెండాలో 2వేల అంశాలు
  • ఆన్​లైన్ వాల్యువేషన్, నిధులపైనా చర్చ

హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు ఇంటర్ బోర్డు మీటింగ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఐదేండ్ల తర్వాత పూర్తి స్థాయి బోర్డు కమిటీ సమావేశం అవుతున్నది. 11న మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఐదేండ్లలో జరిగిన అంశాలతో పాటు తీసుకున్న నిర్ణయాలపైనా రివ్యూ చేస్తారు. కొత్తగా ఆన్​లైన్ వాల్యువేషన్, బయోమెట్రిక్ అటెండెన్స్ తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్టు తెలిసింది. ఇంటర్ బోర్డు చైర్మన్​గా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైస్ చైర్మన్​గా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉంటారు. బోర్డు మీటింగ్​ ప్రతీ ఆరు నెలలకోసారి జరగాలి. కానీ చివరిసారిగా 2017లో సమావేశం అయ్యారు. ఇప్పటి దాకా జరిగిన అన్నీ కార్యక్రమాలు బోర్డు అనుమతి లేకుండానే కొనసాగాయి. ఇద్దరు రెగ్యులర్ బోర్డు సెక్రెటరీలు ఉన్నా.. మీటింగ్​ నిర్వహించకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. మంత్రి చైర్మన్​గా ఉన్నా బోర్డు సమావేశం పెట్టకపోవడంపై అనుమానాలూ తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇన్​చార్జీ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్, మీటింగ్​ పెట్టాలని నిర్ణయించారు. కేవలం ఐదు రోజులు ముందే సమాచారం ఇచ్చి, ఎజెండా పాయింట్లు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 

కాంట్రవర్సీ అంశాలుంటే రిజెక్ట్​


సమావేశంలో ప్రధానంగా ఇప్పటి దాకా బోర్డు నిధులను ఇతర సంస్థలకు, వ్యక్తులకు ఇవ్వడం, ఆన్​లైన్​ క్లాసుల నిర్వహణకు చేసిన ఖర్చు, ఇతర కాలేజీలకు, సంస్థలకు ఇచ్చిన లోన్లు, కొత్త పీఆర్సీ అమలు, డీఏ పెంపు, రిటైర్మెంట్ వయోపరిమితి, ఇంటర్ కాలేజీ అఫిలియేషన్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజుల వసూళ్లు, పరీక్షల నిర్వహణకు అయిన ఖర్చు తదితర అంశాలను రాటిఫై చేయించుకోవాల్సి ఉంది. సుమారు 2వేల అంశాలతో కూడిన ఎజెండా పెడుతున్నట్టు తెలిసింది. వీటిలో ఏమైనా కాంట్రవర్సీ అంశాలుంటే, రిజెక్ట్ చేసే అవకాశమూ ఉంటుంది. వీటితో పాటు ఇంటర్​ పరీక్షల్లో సంస్కరణలపైనా చర్చించే చాన్స్​ ఉంది. ఈ ఏడాది కొన్ని సబ్జెక్టుల్లో ఆన్​లైన్​ వాల్యువేషన్ చేయించాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం. అయితే దీనికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుండటంతో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా.. లేదా.. అనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.