వేసవి సెలవుల్లో ఇంటర్ క్లాసులు.. రాత్రి పది దాకా క్లాసులు

వేసవి సెలవుల్లో ఇంటర్ క్లాసులు..  రాత్రి పది దాకా క్లాసులు

 

  • ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు
  • ఫస్టియర్ పూర్తయిన వారికి సెకండియర్ క్లాసులు
  • సెకండియర్ ఎగ్జామ్స్ రాసిన వారికి జేఈఈ, ఎంసెట్, నీట్ కోచింగ్
  • ఇంటర్ బోర్డు ఆదేశాలు బేఖాతర్

హైదరాబాద్, వెలుగు: సమ్మర్ హాలిడేస్​లో ఇంటర్ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎండాకాలం సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. అడ్మిషన్ షెడ్యూల్ రాకున్నా.. స్టూడెంట్లకు ప్రవేశాలు ఇస్తున్నాయి. ‘‘మార్చి 31 నుంచి మే 31 దాకా అన్ని రకాల మేనేజ్​మెంట్ల పరిధిలోని జూనియర్ కాలేజ్​లకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. అడ్మిషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాతే ప్రవేశాలు తీసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు” అని గత నెల 28న ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా ఆదేశాలు జారీ చేశారు. అయినా.. ఎవరూ ఈ నిబంధనలు పాటించడం లేదు. ఇంటర్ బోర్డుకు విద్యార్థి సంఘాలు, స్టూడెంట్స్ ఫిర్యాదులు చేస్తున్నా వాళ్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పరీక్షలు పూర్తయిన వారం రోజుల నుంచే

ఫిబ్రవరి 28 నుంచి మార్చి19 దాకా ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2023–24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి 31 నుంచి కాలేజీలకు ఇంటర్ బోర్డు అధికారులు సెలవులు ప్రకటించారు. అయితే, కొన్ని కార్పొరేట్ కాలేజీలు మాత్రం పరీక్షలు పూర్తయిన వారం రోజుల నుంచే మళ్లీ తరగతులు మొదలుపెట్టాయి. ఫస్టియర్ పూర్తయిన స్టూడెంట్లకు సెకండియర్ క్లాసులు ప్రారంభించగా, సెకండియర్ పూర్తయిన స్టూడెంట్స్​కు జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని కాలేజీలు డే స్కాలర్స్, హాస్టలర్స్ తో క్లాసులు తీసుకుంటున్నాయి. కొన్ని కాలేజీలు మాత్రం కేవలం హాస్టలర్స్ కు స్పెషల్ క్లాసులు కొనసాగిస్తున్నాయి. ఆయా కాలేజీలకు చెందిన కొన్ని బ్రాంచుల్లో ఆన్​లైన్ క్లాసులూ కంటిన్యూ చేస్తున్నాయి.

రాత్రి పది దాకా క్లాసులు

ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కాలేజీల్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీంతో స్టూడెంట్స్ మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. వందలాది మంది స్టూడెంట్స్​తో క్లాసులు నడిపిస్తున్నా ఇంటర్ బోర్డు అధికారులకు తెలియదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ కార్పొరేట్ కాలేజ్ ఏకంగా క్లాసులు నిర్వహిస్తామని పెద్ద యాడ్ ఇచ్చింది. సాధారణంగా యాడ్ అప్రూవ్ చేయాల్సింది ఇంటర్ బోర్డు అధికారులే. అయితే, ఇది వారికి తెలియకుండా ఇచ్చారా.. తెలిసే ఇచ్చారా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది. పలుచోట్ల విద్యార్థి సంఘాల నేతలు క్లాసులను అడ్డుకుంటున్నారు. అయినా.. ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

క్లాసులు బంజేయ్యాలి: బాధిత స్టూడెంట్లు

పటాన్ చెరులోని పాటి(బాయ్స్) క్యాంపస్​లో రెండు వారాల నుంచి క్లాసులు (సెకండియర్) నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి పదిగంటల దాకా క్లాసులు తీసుకుంటున్నరు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నం. ఇంటర్ ఆఫీసర్లకు కాల్స్ చేసినా పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు క్లాసులు బంద్ చేయించి సెలవులు ఇప్పించండి.