సెలవుల్లో ఎగ్జామ్స్..బోర్డు ఆదేశాలు పట్టవా?

సెలవుల్లో ఎగ్జామ్స్..బోర్డు ఆదేశాలు పట్టవా?

హైదరాబాద్‍, వెలుగు:  ఇంటర్​బోర్డు ఆదేశాలు తమకు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నాయి ప్రైవేట్​కాలేజీలు. దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా బేఖాతర్​చేస్తూ బోర్డుకు సవాల్​విసురుతున్నాయి. హాలీడేస్​లో క్లాసులు కానీ, ఎగ్జామ్స్ కానీ నిర్వహించరాదని ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి సయ్యద్‍ ఉమర్‍ జలీల్‍ రెండు రోజుల క్రితం నోట్​విడుదల చేశారు. కానీ యాజమాన్యాలు యథేచ్ఛగా ఎగ్జామ్స్​కండక్ట్​చేస్తున్నాయి. క్లాసులు నిర్వహిస్తూ సెలవులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. కుటుంబంతో కొన్నాళ్లు సరదాగా గడపాలని, చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్న స్టూడెంట్స్ ఆశలు నెరవేరడం లేదు. ప్రభుత్వం కార్పొరేట్‍ కాలేజీలకు వత్తాసు పలకడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు స్టూడెంట్స్ యూనియన్‍ నేతలు ఆరోపిస్తున్నారు.

మాకు సెలవులు వర్తించవు మమ్మీ

జిల్లా పరిధిలో సుమారు 264 ప్రైవేట్ ఇంటర్‍ కాలేజీలు ఉన్నాయి. ఇందులో నారాయణ, శ్రీచైతన్య, శ్రీగాయత్రి వంటి కార్పొరేట్‍ కాలేజీల బ్రాంచీలు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. వీటి నుంచి ఏటా 1.40 లక్షల మంది స్టూడెంట్స్ బోర్డు పరీక్షలు హాజరవుతూ ఉంటారు. వాటితోపాటు జేఈఈ, నీట్, ఎంసెట్‍ తదితర పరీక్షలకు సిద్ధమయ్యే వారు దాదాపుగా వీటిల్లోనే అడ్మిషన్లు తీసుకుంటారు. ముఖ్యంగా సెకండ్​ఇయర్‍ స్టూడెంట్స్ కు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ కంప్లీట్​చేసేందుకుగాను దసరా సెలవులు ఇచ్చేందుకు మేనేజ్​మెంట్లు ఇష్టపడటం లేదు. విద్యార్థులను పండుగకు ఇంటికి తీసుకుపోయేందుకు పేరెంట్స్ కూడా ఇంట్రస్ట్​చూపించడంలేదని విద్యావేత్తలు అంటున్నారు. విద్యార్థులకు ఓపిక లేకున్నా క్లాస్‍లకు హాజరు కావాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ సెలవులు తమకు వర్తించవని స్టూడెంట్స్ పేరెంట్స్ కు చెబుతున్నట్లు సమాచారం. పండుగకు 2 రోజులు మించి సెలవులు ఇవ్వడం లేదని, ప్రైవేట్‍ కాలేజీలు స్టూడెంట్స్ కు సెలవులు ఇచ్చేలా చూడాలని అనేక మార్లు బోర్డు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు.

హాస్టల్స్లోనే వీక్లీ టెస్ట్లు

ప్రభుత్వం సెప్టెంబర్‍ 28 నుంచి అక్టోబర్‍ 9 వరకు దసరా సెలవులు ప్రకటించింది. కానీ ఇదేమీ పట్టని ప్రైవేట్‍ ఇంటర్‍ కాలేజీలు క్లాస్‍లు నిర్వహిస్తున్నాయి. ఫస్ట్​ఇయర్‍, సెకండ్​ఇయర్‍ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వీక్లీ టెస్ట్ పెడుతున్నారు. మెయిన్ బ్రాంచీలో క్లాసులు నిర్వహిస్తే విద్యార్థి సంఘాలకు తెలుస్తుందని శివారు బ్రాంచీలలో రహస్యంగా క్లాసులు నిర్వహించేందుకు ప్లాన్ చేశాయి. కార్పొరేట్, ప్రైవేట్‍ కాలేజీలకు ఉన్న రెసిడెన్షియల్‍ హాస్టల్స్ లోనూ వీక్లీ టెస్ట్ లు కండక్ట్ చేస్తున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పండుగకు సొంతిండ్లకు పంపించకపోతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క కాలేజీ తప్పనిసరిగా సెలవులు ఇవ్వాల్సిందేనని బోర్డు అధికారులు చెప్పారు. ఫిర్యాదులు వస్తే పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు.