టెన్త్ గ్రేడ్‌లే ఇయ్యలే.. ఇంటర్ అడ్మిషన్లు

టెన్త్ గ్రేడ్‌లే ఇయ్యలే.. ఇంటర్ అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు:టెన్త్ క్లాస్ స్టూడెంట్ల రిజల్ట్ ఇంకా రాలేదు. ఇంటర్ అడ్మిషన్లకు బోర్డు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరీక్షలు లేకుండా టెన్త్ స్టూడెంట్లంతా పాస్ అని సర్కారు ప్రకటించినప్పటికీ.. గ్రేడ్ల వారీగా స్టూడెంట్ల ఫైనల్ రిజల్ట్ రావాల్సి ఉంది. కానీ, ఆ రిజల్ట్ రాకముందే రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు అయిపోయాయి. ఆన్​లైన్​లో క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదంతా సర్కారు పెద్దలకు, ఇంటర్ బోర్డుకు తెలిసే జరుగుతున్నా.. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 

ఏప్రిల్ లోనే సీట్లు ఫుల్ 

రాష్ట్రంలో 1,486 ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 300 వరకు కార్పొరేట్ కాలేజీలున్నాయి. ఇంటర్ బోర్డు ఏటా కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చిన తర్వాత, అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ యేడు ఇటీవలే కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చింది. మేనేజ్‌‌మెంట్లు ఈ నెల 12 నుంచి అఫిలియేషన్​కు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఉన్న కాలేజీలకు పర్మిషన్ ఇస్తుంది. వాటిలోనే అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంటుంది. కానీ కార్పొరేట్ కాలేజీలు ఈ రూల్స్‌‌ను  పట్టించుకోవట్లేదు. జనవరి నుంచే అడ్మిషన్లు మొదలుపెట్టాయి. టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సర్కారు ప్రకటించిన వెంటనే అడ్మిషన్లను స్పీడప్ చేశాయి. ఏప్రిల్ నెలాఖరు వరకే కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయినట్టు సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో స్టూడెంట్ నుంచి ఏటా రూ.1.70 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకూ ఫీజులు నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు. 

బ్రిడ్జి కోర్సుల పేరుతో క్లాసులు

ఇంటర్ స్టూడెంట్లకు ఆఫ్​లైన్​లో గానీ, ఆన్​లైన్​లో గానీ క్లాసులు నిర్వహించవద్దని ఇంటర్ బోర్డు గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే చాలా కార్పొరేట్ కాలేజీలు ఫస్టియర్ క్లాసులను కూడా ఇటీవలే ప్రారంభించాయి. ఇవి ఇంటర్ క్లాసులు కావనీ, ఐఐటీ, మెడికల్ క్లాసులని అధికారులకు చెబుతున్నారు. కొన్ని కాలేజీలు బ్రిడ్జి కోర్సుతో పేరుతో క్లాసులు స్టార్ట్ చేశాయి. కొందరు స్టూడెంట్లు ఇంటర్ బోర్డు హెల్ప్ డెస్క్‌‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలుస్తోంది.  అడ్మిషన్లు, క్లాసుల వ్యవహారం ఇంటర్ బోర్డు ఆఫీసర్లకు తెలిసే జరుగుతుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

కాలేజీలపై చర్యలు తీసుకోవాలె 

కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ఇంటర్ కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలియదు. ఇలాంటి టైంలో సర్కారు రూల్స్ కు విరుద్ధంగా కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్లు, ఆన్‌‌లైన్‌‌ క్లాసులు నిర్వహించడం సరికాదు. గతంలో దీనిపై ఇంటర్ బోర్డు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు అధికారులు ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. 
- ఎండీ జావీద్, 
   ఎస్ఎఫ్ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్   

గుర్తింపు రద్దు చేయాలె

టెన్త్ రిజల్ట్ రాకముందే కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించడం దారుణం. ఇది ఇంటర్ బోర్డు వైఫల్యానికి నిదర్శనం. అన్ని కార్పొరేట్ కాలేజీల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలి.  రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహించి, క్లాసులు కొనసాగిస్తున్న కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి. 
- శ్రీహరి, ఏబీవీపీ జాతీయ కమిటీ నేత