స్టూడెంట్స్ ఆత్మహత్యలు: మంత్రి సబితను బర్తరఫ్ చేయాలె

స్టూడెంట్స్ ఆత్మహత్యలు: మంత్రి సబితను బర్తరఫ్ చేయాలె

హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్‌‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాహత్నం చేసిన విద్యార్థిని నందిని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గాంధీ హాస్పిటల్‌ ఎదుట నిరసన చేపట్టాయి. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యతగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్ బోర్డు కార్యదర్శిని తొలగించాలని నినాదాలు చేశారు. నందిని కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రాష్ట్రంలో అలజడికి కారణమయ్యాయి. పరీక్షలు రాసిన వారిలో 51 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే ఈ ఫలితాలతో మనస్తాపం చెంది ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా.. ఇవాళ మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వరుసగా విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు,  తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫెయిల్ అయిన అందరికీ కనీసం పాస్‌ మార్కులు వేసి రిజల్ట్ మరోసారి విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని నందిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఈ రోజు నందిని మరణించింది. ఇంటర్ ఫస్టియర్‌‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై నందిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.