టెలిగ్రామ్​లో ఫేక్ ​ట్రేడింగ్​ ..ఇంటర్​ స్టూడెంట్​ బలి

టెలిగ్రామ్​లో ఫేక్ ​ట్రేడింగ్​ ..ఇంటర్​ స్టూడెంట్​ బలి
  • రూ.1.60 లక్షలు పోవడంతో మనస్తాపం
  • పురుగుల మందు తాగి ఆత్మహత్య 
  • హనుమకొండ జిల్లాలో ఘటన 

శాయంపేట, వెలుగు : టెలిగ్రామ్​యాప్​లో ట్రేడింగ్​చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించడంతో రూ.1.60 లక్షలు పెట్టి మోసపోయిన ఇంటర్​స్టూడెంట్​పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై ప్రమోద్​కుమార్​కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లికి చెందిన ఆవుల శ్రీనివాస్​వ్యవసాయం చేస్తూ కొడుకు దిలీప్(17), మరో కూతురిని చదివిస్తున్నాడు.

​దిలీప్ ​ఇంటర్​ఫస్ట్​ఇయర్​ చదువుతుండగా, కూతురు పదో తరగతి ఎగ్జామ్స్​ రాస్తోంది. దిలీప్ ​టెలిగ్రామ్​ యాప్​లో  ట్రేడింగ్​ చేస్తే లాభాలొస్తాయంటూ ఇచ్చిన ప్రకటన చూసి ఆశపడ్డాడు. మొదటగా రూ.5వేలు పెట్టగా అంతకు డబుల్​అమౌంట్​వచ్చింది. దీంతో తన పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాడు. ఆత్యాశకు పోయి తన దగ్గరున్న డబ్బులే కాకుండా ఫ్రెండ్స్​దగ్గర, తండ్రి వద్ద ఉన్న రూ.60వేలు కలిపి రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

డబ్బులు తిరిగి రాకపోవడంతో పోవడంతో మోసపోయానని గ్రహించాడు. విషయం తెలిస్తే తండ్రి ఏమంటాడోనని భయపడ్డాడు. ఫ్రెండ్స్​ దగ్గర తీసుకున్న డబ్బులు ఎలా ఇచ్చేదని మదనపడ్డాడు. ఈ నెల 3న పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికే గమనించిన తల్లిదండ్రులు దిలీప్​ను వెంటనే ములుగు ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి పరకాలలో ప్రైవేటు హాస్పిటల్​లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్​తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.