వాట్సాప్కే హాల్ టికెట్లు.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. పేరెంట్స్ నంబర్కు నేరుగా డౌన్‌‌‌‌లోడ్ లింక్

వాట్సాప్కే హాల్ టికెట్లు.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. పేరెంట్స్ నంబర్కు నేరుగా డౌన్‌‌‌‌లోడ్ లింక్
  • తప్పులుంటే ముందే సరిచూసుకునే అవకాశం
  • సెకండియర్ హాల్ టికెట్‌‌‌‌పై ఫస్టియర్ మార్కులు
  • ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్ షురూ

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ స్టూడెండ్లకు, వారి పేరెంట్స్​కు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. హాల్ టికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా లింక్​ను నేరుగా పేరెంట్స్​ మొబైల్ నంబర్లకే ‘వాట్సాప్’  ద్వారా పంపనుంది. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 25 నుంచి పబ్లిక్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షల్లో పారదర్శకత కోసం హాల్ టికెట్లను నేరుగా పేరెంట్స్ నంబర్లకు పంపించాలని ఇంటర్మీడియట్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే బోర్డులో రిజిస్టర్డ్ అయిన పేరెంట్స్ ఫోన్లకు వచ్చే లింక్ ద్వారా హాల్ టికెట్ ప్రివ్యూను డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. 

ఫస్టియర్ విద్యార్థులు తమ టెన్త్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో, సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో ఈ లింక్ ఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో హాల్ టికెట్‌‌లోని గ్రూపు, మీడియం, ఫొటో, సంతకం వంటి వివరాల్లో ఏవైనా తప్పులుంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ లేదా డీఐఈఓ దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకునే వెసులుబాటును బోర్డు కల్పించింది. 

శనివారం నుంచే పేరెంట్స్ కు మెసేజ్​లు పంపించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వివరాల్లో తప్పులుంటే ఒకటి, రెండు రోజుల్లో ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. చాలా కాలేజీల్లో యాజమాన్యాలు సరిగ్గా పరీక్షల ముందు హాల్​టికెట్లను తమ వద్ద పెట్టుకొని స్టూడెంట్లు, పేరెంట్స్​ను ఫీజుల కోసం వేధిస్తున్నాయి. ఇప్పుడు హాల్ టికెట్లు ఫోన్లకే రానుండడంతో ఇక కాలేజీల చుట్టూ తిరిగే తలనొప్పి తప్పనుంది. 

మార్కుల లిస్ట్ కూడా.. 
సెకండియర్ విద్యార్థుల హాల్ టికెట్ ప్రివ్యూలో మరో ప్రత్యేకత ఉంది. ఫస్టియర్‌‌లో ఏయే సబ్జెక్టులు పాసయ్యారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఏవైనా ఫెయిల్ అయ్యారా అనే పూర్తి వివరాలు ఇంటర్ హాల్ టికెట్ లోనే ప్రింట్ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుపై క్లారిటీ వస్తుందని బోర్డు తెలిపింది. 

ముఖ్యమైన తేదీలివే..

  • ఇంగ్లిష్ ప్రాక్టికల్స్: జనవరి 21 (ఫస్టియర్), జనవరి 22 (సెకండియర్)
  • ఎథిక్స్  అండ్ ఎన్విరాన్మెంట్: జనవరి 23, 24 తేదీలు 
  • జనరల్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు