
- 9 దాటితే నోఎంట్రీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఈ ఏడాది కూడా నిమిషం నిబంధన అమలు చేస్తున్నామని, 9 గంటల తర్వాత ఎవర్నీ లోపలికి అనుమతించబోమని బోర్డు సెక్రెటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం ఇంటర్ కమిషనరేట్ లో సీఓఈ జయప్రదబాయి, పరీక్షల విభాగం అధికారులు శ్రీనివాస్, భీమ్ సింగ్, మోహన్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలకు మొత్తం 9,47,699 మంది హాజరుకానున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకండియర్ స్టూడెంట్లని చెప్పారు.
ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు
1473 సెంటర్లు ఏర్పాటు చేశామని, స్టూడెంట్లకు అన్ని సౌలత్లు కల్పించామని నవీన్ మిట్టల్ తెలిపారు. ఏ ఇబ్బంది వచ్చినా 040–24601010, 040–24655027 ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని స్టూడెంట్లకు సూచించారు. ఇవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా స్టూడెంట్లే బోర్డ్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. స్టూడెంట్లు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఓఎంఆర్ షీట్ పై ఉన్న డేటాను పరిశీలించాలని, తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలని సూచించారు.
ఆన్లైన్ వాల్యుయేషన్ ఉంటది
ఈ ఏడాది ఆన్సర్ షీట్ల ఆన్లైన్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచామని, రెండోసారి 2 కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. ఏ కంపెనీకి టెండర్ ఇచ్చేది బుధవారం క్లారిటీ ఇస్తామన్నారు.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ వాల్యుయేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. టెన్త్ రిజల్ట్స్ వచ్చే లోగా ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ముగిస్తామని నవీన్ మిట్టల్ చెప్పారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్న కాలేజీల్లో చదివే స్టూడెంట్లు, వారి పేరెంట్ల నుంచి అంగీకార పత్రం తీసుకుంటామని అన్నారు. సెకండియర్ గుర్తింపు రాకున్నా.. ఇబ్బంది ఉండబోదని రాతపూర్వకంగా ఇవ్వాలని నవీన్ మిట్టల్ సూచించారు.