త్వరలో ఇంటర్ పరీక్షలు!

త్వరలో ఇంటర్ పరీక్షలు!
  • ఆగస్టులో ఫస్టియర్ పరీక్షలు!
  • సర్కారుకు ఇంటర్ బోర్డు ప్రపోజల్
  • ప్రభుత్వం ఓకే అంటే నిర్వహణకు బోర్డు రెడీ

హైదరాబాద్, వెలుగు: కరోనా ప్రభావం కొంత తగ్గడంతో వాయిదా వేసిన పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు రెడీ అవుతోంది. వచ్చేనెలలో ఫస్టియర్ పూర్తయిన స్టూడెంట్లకు ఎగ్జామ్స్ పెట్టాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రపోజల్స్​ను ఇంటర్ బోర్డు ఇటీవల సర్కారుకు పంపించినట్టు తెలిసింది. ఒకవేళ సర్కారు ఓకే చెప్తే పరీక్షలు పెట్టేందుకు రెడీ అవుతోంది.

2020–21 అకాడమిక్ ఇయర్​లో ఫస్టియర్​లో 4,59,008 మంది స్టూడెంట్లు, సెకండియర్​లో 4,73,967 మంది ఎగ్జామ్ ఫీజు కట్టారు. కరోనా తీవ్రత నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. జూన్​ నెలలోనూ కోవిడ్ ప్రభావం తగ్గకపోవడంతో, సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు చేసి ఫస్టియర్ ఆధారంగా స్టూడెంట్లకు మార్కులు ఇచ్చారు. కానీ ఫస్టియర్ ఎగ్జామ్స్​పై అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ప్రస్తుతం ఫస్టియర్​ పూర్తయిన స్టూడెంట్లు టెన్త్ ఎగ్జామ్స్ రాయకుండానే, పాస్ అయ్యారు. ఫస్టియర్​లోనూ అలాగే పాస్ చేస్తే, టాలెంట్ ఉన్న స్టూడెంట్లకు నష్టం జరుగుతుందని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా కేసులు తగ్గుతుండటంతో, ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా సెకండ్​వీక్​లో పరీక్షలు నిర్వహించేందుకు అవకాశమివ్వాలని ఇంటర్ బోర్డు రెండు రోజుల కింద సర్కారుకు లెటర్ రాసినట్టు తెలిసింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్​సెమిస్టర్ ఎగ్జామ్స్​తో పాటు పలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​కూడా ఫిజికల్​గానే జరుగుతున్నాయని సర్కారుకు పంపిన రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. ఆగస్టు నెల అయితే స్టూడెంట్లకు ఇబ్బందులు ఉండవని దాంట్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఒక వేళ కరోనా థర్డ్ వేవ్ వస్తే భవిష్యత్​లో పరీక్షలు పెట్టడం కష్టమవుతుందని అధికారులు చెప్తున్నారు.

స్టేట్​లో 4.59లక్షల మంది ఫస్టియర్ స్టూడెంట్లు ఉన్నారు. వారికి ఇప్పటికే హాల్​టికెట్లు రెడీ చేయగా, పశ్నపత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎగ్జామ్స్ డ్యూటీలకు వచ్చే అధికారులు, సిబ్బంది మాత్రం తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలనే రూల్ పెట్టాలని యోచిస్తున్నారు. పరీక్షలకు సర్కారు ఓకే చెప్తే15రోజుల టైమ్ ఇచ్చి పరీక్షలు పెట్టాలని భావిస్తున్నారు. పరీక్షలు స్టూడెంట్ ఫ్రెండ్లీగా నిర్వహించాలనే భావనలో ఉన్నారు. అయితే సర్కారు పరీక్షల నిర్వహణకు అనుమతి ఇస్తుందా లేదా చూడాలి.