మహబూబ్​నగర్​ జిల్లాకు ఆధిపత్య పోరు

మహబూబ్​నగర్​ జిల్లాకు ఆధిపత్య పోరు
  • జిల్లాలకు చేరిన స్టేట్ లీడర్ల ఆధిపత్య పోరు
  • అనిరుధ్‌ రెడ్డికి టికెట్ ఇస్తామన్న స్టార్ క్యాంపెయినర్‌‌ కోమటి రెడ్డి 
  • ఎర్రశేఖర్‌‌కు సపోర్ట్ చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి
  • ఆందోళనలో పార్టీ కేడర్ 

మహబూబ్​నగర్​, వెలుగు : రాష్ట్రస్థాయి కాంగ్రెస్‌లో ఉన్న ఆధిపత్య పోరు జిల్లాలకు పాకింది.  పార్టీలో తలోదారి అన్నట్లు వ్యవహరిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి, స్టార్​క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి జిల్లాల్లో తమ వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో తమకు అనుకులంగా ఉండే ఇతర పార్టీల నేతలను జాయిన్​ చేసుకున్న ఈ ఇద్దరు లీడర్లు పాలమూరులోనూ ఇదే సీన్‌ రిపీట్ చేస్తున్నారు. పది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌‌ను రేవంత్‌ రెడ్డి పార్టీలో చేర్చుకోగా.. జడ్చర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న జనంపల్లి అనిరుధ్ రెడ్డికే టికెట్‌ ఇస్తామని మూడురోజుల కింద కోమటి రెడ్డి ప్రకటించారు. కాగా, ఇద్దరు నేతల తీరుతో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక క్యాడర్‌‌ కన్ఫూజన్‌లో పడిపోయింది.  

గత ఎన్నికల్లో టికెట్ఆశించిన అనిరుధ్ రెడ్డి

 ప్రస్తుతం టీపీసీసీ సెక్రటరీగా, జడ్చర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న జనంపల్లి అనిరుధ్​రెడ్డి పదేళ్లుగా పార్టీలో ఉన్నారు. ఈయనకు ముందునుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ఆశించినా రాలేదు. ఈసారి మాత్రం హైకమాండ్ ఆయనకే టికెట్ కన్ఫాం చేసినట్లు నెల రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈయన కోసమే ఏడాదిన్నర క్రితమే పార్టీలో చేరాల్సిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌‌కు ఎంట్రీ ఇవ్వలేదని టాక్‌ నడిచింది.  కానీ, అనూహ్యంగా పది రోజుల క్రితం టీపీపీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి సమక్షంలో ఎర్ర శేఖర్​కాంగ్రెస్‌లో చేరారు.  

కొత్తవారికి టికెట్‌ లేదంటున్న కోమటి రెడ్డి

ఎర్రశేఖర్‌‌ చేరిక అనంతరం ఈ నెల 11న హైదరాబాద్‌లో కోమటిరెడ్డి టీపీసీసీ  తెలంగాణ ఇన్​చార్జ్ మానిక్కం ఠాగూర్​తో చర్చలు జరిపారు.  ఏఐసీసీ నియమించిన జాయినింగ్ కమిటీతో చర్చించకుండా రేవంత్​రెడ్డి ఇతర పార్టీల లీడర్లను కాంగ్రెస్‌లోకి ఎలా ఆహ్వానిస్తారని ఠాగూర్​ను ప్రశ్నించినట్లు తెలిసింది.  తాజాగా ఆదివారం కూడా ఆయన హైదరాబాద్​లో కీలక వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్​రెడ్డి టికెట్​కు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు.  కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి టికెట్ ఇస్తున్నట్లు ఎవరూ హామీ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.  అనిరుధ్​రెడ్డి చాలా రోజులుగా పార్టీలో పనిచేస్తున్నారని, ఆయనకు గతంలోనే టికెట్​కన్ఫాం చేశామన్నారు.  పార్లమెంట్​సమావేశాల మధ్యలో జడ్చర్లలో బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని,  డేట్‌ను త్వరలో అనౌన్స్ ​చేస్తామని చెప్పారు. 

తెరమీదికి డైవర్షన్​ పాలి‘ట్రిక్స్​’

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీలో అనూహ్య పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకే టికెట్‌ ఇవ్వాలని కొందరు లీడర్లు కోరుతున్నారు. అయితే ఈ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కొందరు పాలి‘ట్రిక్స్​’ ప్లే చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.  ఎవరికి టికెట్‌ ఇవ్వాలి? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి?  అనేది టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డే అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. అనిరుధ్​రెడ్డి వర్గం మాత్రం తమ నేతకే ఇస్తామని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హామీ ఇచ్చారని, రేవంత్‌ రెడ్డి కూడా అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు. కాగా, నియోజకవర్గాల్లో గెలిచే వారికే అవకాశం ఇస్తామని, ఈ మేరకు హైదరాబాద్​కు చెందిన సర్వే సంస్థతో రేవంత్‌ రెడ్డి సర్వే చేయిస్తున్నారని సీనియర్లు పేర్కొంటున్నారు.