విపత్తు ప్రమాదాలు తగ్గేదెలా? :  డా. శ్రీధరాల రాము

విపత్తు ప్రమాదాలు తగ్గేదెలా? :  డా. శ్రీధరాల రాము

అక్టోబర్ 13 వ తారీఖును ‘ఇంటర్నేషనల్​ డే ఫర్​ డిజాస్టర్​ రిస్క్​ రిడక్షన్​’ గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ  ప్రకటించినది. ఇది 1989లో  ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనే ప్రమాదాలను నియంత్రించడం, విపత్తులకు గురి కాకుండా విపత్తులను ఎలా తగ్గించుకోవాలో అనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

విపత్తు అనేది ఆకస్మికంగా  సంభవించే తీవ్రమైన సమస్య. ఆర్థిక నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని, పర్యావరణ నష్టాన్ని , ప్రాణ నష్టాన్ని కలిగించే సంఘటనలను విపత్తులుగా పరిగణించవచ్చు. ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న కరోనా వైరస్ వ్యాధి  విపత్తుకు మంచి ఉదాహరణ. ఎందుకంటే కరోనా వైరస్ ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, అనేక  రకాల నష్టాలను కలిగించింది. విపత్తులు రెండు రకాలుగా విభజించవచ్చు.

మొదటిది ప్రకృతి వలన సంభవించే విపత్తులు. ఉదాహరణకు వరదలు, కరవు, భూకంపాలు, పిడుగులు, తుపానులు, సునామి మొదలగునవి. రెండవది మానవుల వలన సంభవించే విపత్తులు. ఉదాహరణకు యుద్ధాలు, రైలు లేదా బస్సు ప్రమాదాలు, టెర్రరిజం,  భోపాల్ గ్యాస్ లీకేజ్  సంఘటన లాంటి పారిశ్రామిక ప్రమాదాలు మొదలగునవి. విపత్తుల నివారణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తగు జాగ్రత్తలను తీసుకోవటం, సూచనలను  విపత్తుల ద్వారా కలిగే నష్ట తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం జరగాలి. 

విపత్తు తీవ్రతను తగ్గించుకొనే పద్ధతులు..

నివారణ: కరోనా వైరస్ వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవడం విపత్తు నివారణ దశకు మంచి ఉదాహరణ. అంటే ఈ దశలో విపత్తులు తరచుగా వచ్చే అంశాలను గుర్తించి విపత్తులు రాకుండా నివారించడం.  ఉదాహరణకు వరదలు తరచుగా వచ్చే ప్రాంతాలలో గృహ నిర్మాణాలను అనుమతించకపోవడం లేదా వరదలు రాకుండా ఆనకట్టలు కట్టడం. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రోడ్డు నిర్మాణంలో మార్పులు చేయడం లేదా ఇతరత్రా చర్యలను చేపట్టడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడం. భూకంపాలు తరచుగా సంభవించే జపాన్ లాంటి దేశాలలో భూకంపాలను తట్టుకునే విధంగా గృహ సముదాయాలను నిర్మించడం వలన నష్టాల్ని నివారించవచ్చు.


సంసిద్ధత:  రాబోయే విపత్తును ఎదుర్కొనుటకు సంసిద్ధంగా ఉండాలి.  ప్రణాళికలను రూపొందించడం, పరికరాలు, సామగ్రిని నిలువ చేసుకొనడం, ప్రజలను తరిలించే వ్యవస్థ,  సంబంధిత వ్యక్తులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాధి మరొకసారి వ్యాప్తి చెందే అవకాశం ఉందని వార్తలు వెలువడిన వెంటనే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం హాస్పిటల్స్​లో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తేవటం, కావలసిన మందులను, వసతులను ఏర్పాటు చేయడం, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం మొదలగునవి  ఈ దశకు మంచి ఉదాహరణ.


ప్రతిస్పందన: బాధితులకు తక్షణ సాయం అందిం చడం, వారికి కావలసిన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు సమకూర్చటం, పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆశ్రయం కల్పించడం, ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం ఈ దశ లక్ష్యాలు. 


పునరుద్ధరణ:  ఈ దశలో నష్టపోయిన అన్ని వ్యవస్థలను పునరుద్ధరణ చేసి పరిస్థితులను తిరిగి మామూలు స్థితికి  తేవడం జరుగుతుంది. ఇండ్లు, భవనాల పునర్నిర్మాణం,  పునర్నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించడం, రోడ్లు, వంతెనలు, విద్యుచ్ఛక్తి,  నీటి వ్యవస్థలు  మొదలైన వాటికి మరమ్మతులు చేపట్టడం,  బాధితులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ చేసి వారిలో మనోధైర్యాన్ని పెంపొందించడం వంటివి ఈ దశలో ఉంటాయి. 


ALSO READ: పండుగపూట జీతాల్లేవ్​..బతుకమ్మ, దసరాకు చేతిలో చిల్లి గవ్వలేక కష్టాలు

పేదలపైనే అధిక ప్రభావం

ఐక్యరాజ్యసమితి  విపత్తు ప్రమాదం తగ్గింపు  కార్యాలయం  ప్రకారం కారణాలు. వరదలకు గురైన 1.5 బిలియన్లలో 89% మంది తక్కువ,మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు.  132 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో, అధిక వరద ముప్పు ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారని అంచనా.   విపత్తు సంభవించినప్పుడు పేదవారు అన్నింటినీ కోల్పోతారు.    తిరిగి  కోలుకోవడానికి బీమా, సామాజిక రక్షణ అనేవి ఉండవు. కాబట్టి   పేదరికాన్ని నిర్మూలించకుండా విపత్తుల వలన కలిగే నష్టాల్ని తగ్గించలేము.

పిడుగుపాటును గుర్తించడమెలా?

ఇటీవలి డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి ఏటా పిడుగుపాటు కారణంగా 60,- 70% గిరిజనులు మరణిస్తున్నారు. దీనికి కారణం  అడవుల్లో  నివసించే వీరికి పిడుగుపాటు నుంచి రక్షణ లేకపోవడం,  సరైన నివాస ప్రాంతాలు లేకపోవడం. భారతదేశంలో ప్రతి ఏటా పిడుగుల కారణంగానే దాదాపు 2000 నుంచి 2500 మంది మరణిస్తున్నారు. భూమి వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ పిడుగుపాటుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఇదొక పెద్ద  విపత్తు. కాబట్టి పిడుగుపాటు గురించి కొంతయినా తెలుసు కోవలసిన అవసరం ఉన్నది. 

‘దామిని లైట్నింగ్ యాప్’

పిడుగుపాటుకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం ‘దామిని లైట్నింగ్ యాప్ ’ ని ప్రారంభించింది. ఈ యాప్ 20 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల పరిధిలో జి.పి.ఎస్. నోటిఫికేషన్ ద్వారా  పిడుగుపాటుకు సంబంధించిన  సమాచారాన్ని 30 లేదా 45 నిమిషాల ముందు తెలియజేస్తుంది.  మానవుని కార్యకలాపాల వలన సంభవించే వాతావరణ మార్పులు కూడా కరువు కాటకాలు,  వరదలు, ఇతర విపత్తులకు కారణం. కాబట్టి సాధ్యమైనంత వరకు కాలుష్యరహితం వైపు మానవ ప్రయాణం కోసం నిరంతర ప్రయత్నం జరగాలి.

ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ ప్రకారం.. మెరుపు వచ్చిన సమయానికి, ఉరుము శబ్దానికి మధ్య కాలవ్యవధిని సెకండ్లలో లెక్కించి ఆ కాల వ్యవధిని ఐదుతో భాగిస్తే పిడుగు మనకు ఎంత దూరంలో ఉన్నదో  తెలిసిపోతుంది. ఉదాహరణకు  మెరుపు, ఉరుముకి మధ్య కాలవ్యవధి 10 సెకండ్లు ఉన్నట్లయితే దాని అర్థం పిడుగు మనకు రెండు మైళ్ల దూరంలో ఉన్నట్టుగా భావించాలి.

– డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ  ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్