పండుగపూట జీతాల్లేవ్​..బతుకమ్మ, దసరాకు చేతిలో చిల్లి గవ్వలేక కష్టాలు

పండుగపూట జీతాల్లేవ్​..బతుకమ్మ, దసరాకు చేతిలో చిల్లి గవ్వలేక కష్టాలు
  •     సాంస్కృతిక సారథి కళాకారులకు రెండు నెలలు పెండింగ్‍
  •     ధరణి ఆపరేటర్లకు ఆరు నెలలుగా బంద్​
  •     ఐదు నెలల నుంచి జీతాలు రాక వీఆర్‍ఏల తిప్పలు

వరంగల్‍, వెలుగు : రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండుగల పూట జీతాలు రాక ప్రభుత్వంలోని చిరుద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‍సోర్సింగ్‍ ఉద్యోగులు తండ్లాడుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు నెలల జీతాలు ఆగడం, ఎలక్షన్‍ కోడ్‍ నేపథ్యంలో మరో రెండు, మూడు నెలలు శాలరీలు వచ్చే అవకాశం లేకపోవడంతో పండుగపూట పిల్లలకు ఓ జత బట్టలు కొనివ్వలేని దుస్థితిలో ఉన్నారు. అప్పులు కూడా పుట్టే పరిస్థితులు లేక మానసిక క్షోభ అనుభవిస్తూనే డ్యూటీలకు అటెండ్‍ అవుతున్నారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న వీఆర్‍ఏలు, రాష్ట్ర      సాంస్కృతిక   సారథి     కళాకారులతో  పాటు    రెవెన్యూ డిపార్టుమెంట్​లో కీలకంగా వ్యవహరించే ధరణి పోర్టల్‍   ఆపరేటర్లుగా పనిచేసే ఔట్‍సోర్సింగ్‍ ఉద్యోగులు ఉన్నారు.

వీఆర్‍ఏలు రెగ్యులర్ ​అయినా జీతాల్లేవ్‍

వీఆర్ఏలకు పేస్కేల్ ​ప్రకటించాలన్న డిమాండ్​తో  గత ఏడాది  81 రోజుల పాటు సమ్మె చేయగా..ప్రభుత్వం ఆగస్టు10న పేస్కేల్ ప్రకటించడంతో పాటు  వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. దాదాపు 23 వేల మంది వీఆర్‍ఏలకు గాను14 వేల మందికి అపాయింట్​మెంట్​ లెటర్లు ఇచ్చి వివిధ డిపార్ట్​మెంట్లలో ఆఫీస్​ సబ్ ​ఆర్డినేట్లుగా, జూనియర్‍ అసిస్టెంట్లుగా నియమించారు. డిగ్రీ చదివిన వారిని జూనియర్​ అసిస్టెంట్లుగా,  ఇంటర్​చదివిన వారిని రికార్డ్​అసిస్టెంట్,  టెన్త్​, అంతకు తక్కువ చదివిన వారిని అటెండర్లుగా నియమించింది. అయితే, నియామకాల తీరును తప్పుపడ్తూ అసలు శాఖల్లోని పలువురు ఆఫీస్​ సబ్​ఆర్డినేట్లు కోర్టుకెక్కారు. దీంతో  వీఆర్​ఏలు ప్రభుత్వోద్యోగులుగా గుర్తింపు పొందినప్పటికీ కనీసం ఐడీ కార్డులకు సైతం నోచుకోలేదు.

రెగ్యులరైజ్​ చేసే క్రమంలో కొన్ని రూల్స్, గైడ్‍లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉండగా ఆ ప్రాసెస్‍ లేట్ చేశారు. దీనికి ముందు దాదాపు మూడు నెలలు వీఆర్‍ఏలు సమ్మెలో ఉన్నారు. వీటికి సంబంధించిన జీతాలు సైతం పెండింగ్​లో ఉన్నాయి. అక్టోబర్‍ నెలలో ఎలక్షన్‍ కోడ్‍ వస్తుందనే ముందస్తు సమాచారమున్నా వీఆర్ఏల సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. దీంతో ఐదు నెలల జీతాలు పెండింగ్​లో పడ్డాయి. ఎలక్షన్‍  కోడ్‍  నేపథ్యంలో మరో  రెండు  నెలలు జీతాలు వస్తాయో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో బతుకమ్మ, దసరా పండుగలు రావడంతో ఖర్చులకు  తెలిసిన కాడల్లా అప్పులు చేస్తున్నారు.

సర్కారును పొగిడే కళాకారులకూ కష్టాలే!

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 583 మంది కళాకారులు పనిచేస్తున్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోగ్రాములైనా.. ప్రభుత్వ కార్యక్రమాలైనా సారథి కళాకారులు లేకుండా సభ ముందుకు సాగే పరిస్థితి లేదు. దళితబంధు మొదలు, డబుల్‍ ఇండ్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‍ కిట్‍ లాంటి స్కీములను ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావడానికి కళాకారులు కాళ్లకు గజ్జెకట్టి ఊరురా తీరుగుతున్నారు.


ALSO READ: అక్టోబర్ 13 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

కాగా, వీరికి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. అక్టోబర్‍ నెల సగానికి వచ్చినా నేటికీ ఆగస్ట్​, సెప్టెంబర్‍ జీతాలు రాలేదు. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం ఎలక్షన్‍ డ్యూటీల పేరుతో ఒక జిల్లాలో పనిచేసే కళాకారులను ఇతర జిల్లాల్లో విధులకు పంపిస్తున్నారు. ఇప్పటికే జీతాలు రాక కుటుంబపోషణ భారంగా మారిందని, తీరా ఛార్జీల కోసం అప్పు చేయాల్సివస్తోందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

ధరణి ఆపరేటర్లకు..7 నెలలుగా నో శాలరీస్‍

 రెవెన్యూశాఖలో కీలకంగా వ్యవహరించే ధరణి పోర్టల్‍ ఆపరేటర్లకు రాష్ట్రంలో ఏడు నెలలుగా జీతాలివ్వడంలేదు. ఈ-సెంట్రిక్‍ (e_centric) సంస్థలో ఔట్​ సోర్సింగ్​ విధానంలో ఐదేండ్లుగా వీరు సేవలందిస్తున్నారు. జీతాలడిగితే ‘జాబ్‍ బంద్‍ చెయ్‍’ అనే వార్నింగులే వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఇవాళ సమర్థ పాలన అందిస్తున్నామని సర్కారు చెప్పుకుంటోందంటే అందుకు తామే కారణమని,  కానీ సదరు సంస్థ ద్వారా జీతాలు ఇప్పించడంలో మాత్రం చొరవ చూపడం లేదని వాపోతున్నారు. జీతాల కోసం మార్చి నుంచి మెమొరాండాలు ఇస్తుంటే..పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

సర్కారు తీరువల్లే.. ఆత్మహత్యలు

వీఆర్‍ఏలుగా మేము సమ్మెకు దిగినప్పుడు  పేరుకే మమ్మల్ని ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ సర్కారు జీఓలు ఇచ్చింది. కానీ, సమ్మె కాలం మూడు నెలల జీతంతో పాటు మిగిలినవాళ్లకు ఇచ్చిన 30 శాతం పీఆర్‍సీ ఇవ్వలేదు. కనీసం ఐడీ కార్డులు కూడా ఇప్పటికీ అందించలేదు. ఓ విధంగా సర్కారే ఇతరులతో కోర్టు కేసులు వేయించింది. వీఆర్‍ఏ వ్యవస్థ రద్దు చేసింది. అసలు మేం ఏ పోస్టుల్లో ఉన్నామో తెలియట్లేదు. దీని గురించి ఎవ్వరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు.

మా చిన్న పోస్టులను ఆర్డీఓల మాదిరి ఎక్కడెక్కడో జిల్లాల్లో వేశారు. కనీసం బస్సు చార్జీలకు కూడా పైసల్లేవ్‍. ఇప్పటికే జనగామ జిల్లా లింగాల ఘన్‍పూర్‍ మండలంలో ఆర్థిక సమస్యలతో ఒక అమ్మాయి చనిపోగా..హనుమకొండలో బుధవారం సతీశ్​ చనిపోయాడు. ఇంకెంతమంది చనిపోతే ఈ సర్కారు స్పందిస్తుందో అర్థం కావట్లేదు.

- శిరీష, వీఆర్‍ఏల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు