అంతర్రాష్ట్ర అటెన్షన్​ డైవర్షన్​ గ్యాంగ్​ అరెస్టు

అంతర్రాష్ట్ర అటెన్షన్​ డైవర్షన్​ గ్యాంగ్​ అరెస్టు

రంగు కాగితాల సంచి ఇచ్చి రూ.60 లక్షలు కొట్టేసిన  గ్యాంగ్, 8 మంది అరెస్ట్

మల్కాజిగిరి,వెలుగు: తక్కువ ధరకు గోల్డ్​ అమ్మకాల పేరుతో అరకోటికిపైగా కొట్టేసిన అంతర్రాష్ట్ర అటెన్షన్​ డైవర్షన్​ గ్యాంగ్​ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్​మెట్​లోని రాచకొండ కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో సీపీ మహేశ్​భగవత్ వివరాలు వెల్లడించారు. విద్యానగర్​లో ఉంటున్న మహేశ్​​(35) రియల్​ ఎస్టేట్​ బ్రోకర్. సరూర్​నగర్​లో ఉంటున్న వ్యాపారి, రియల్​ ఎస్టేట్​ బ్రోకర్​ తాళ్లూరి వెంకటేశ్వర రావుతో మహేశ్​కు పరిచయం ఉంది. 10 రోజుల కిందట తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్ద 1.5కిలోల బంగారం ఉందని, తక్కువ ధరకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని వెంకటేశ్వర​రావుకు మహేశ్​ చెప్పాడు.  బంగారం కొనాలనుకుంటే రూ.60 లక్షలు సిద్ధం చేసుకోవాలన్నాడు. మహేశ్ మాటలు నమ్మిన వెంకటేశ్వరరావు 1.5 కిలోల బంగారం కొనడానికి రూ. 60 లక్షలు ఏర్పాటు చేశాడు.

ఈ నెల 20న ఉదయం 9గంటలకు వెంకటేశ్వరరావుకు మహేశ్​ ఫోన్​ చేసి దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌ వద్ద కలుస్తానని చెప్పాడు.  అదే రోజు సాయత్రం 3గంటలకు మళ్లీ ఫోన్ చేసి 1.5 కిలోల బంగారంతో కనకరాజు, ప్రసన్న అనే ఇద్దరు వ్యక్తులను ఇంటికి పంపిస్తున్నట్టు చెప్పాడు. అనంతరం ఇద్దరు గుర్తు వ్యక్తులు వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చారు. అతడి మాటల్లో పెట్టి రూ. 60 లక్షలు ఉన్న ​బ్యాగ్ తీసుకున్నారు. తర్వాత అంతకుముందే తమ వెంట తెచ్చుకున్న అలాంటి ఓ బ్యాగ్​ను అతడికి ఇచ్చి 1.5 కిలోల బంగారం తీసుకుని వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెంకటేశ్వరరావును మాటల్లో పెట్టిన  ఆ ఇద్దరు వ్యక్తులు బ్యాగ్​ ను మార్చి డబ్బులు తీసుకెళ్లిపోయారు. వాళ్లు వెంకటేశ్వరరావుకు ఇచ్చిన బ్యాగ్​లో రంగుల కాగితాలు ఉండటంతో బాధితుడు మహేశ్​ కు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు సరూర్​ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన  ఎల్​బీనగర్​ ఎస్​వోటీ, సరూర్​నగర్​ పోలీసులు  నిందితుల కోసం గాలింపు చేపట్టారు.  మంగళవారం విద్యానగర్‌లోని మహేశ్ ఇంట్లో నిందితులున్నట్లు సమాచారం  అందుకుని అక్కడ దాడులు చేశారు. మహేశ్​ తో పాటు అంతర్రాష్ట్ర గ్యాంగ్​ కు చెందిన   రియాజ్​, వనేష్​కుమార్,  కనకరాజు, రవి  సురేందర్ ​, షేక్​ సైదులు, అనుమోలు సైదులును అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ.45 లక్షల10 వేల క్యాష్, 13 సిమ్​ కార్డులు, కారు, బైక్​, నేరానికి వాడిన సూట్​కేస్​, బ్యాగ్​ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్​కు తరలించామన్నారు.