బుల్లెట్, పల్సర్​ బండ్లుంటే జాగ్రత్త.. దొంగల టార్గెట్ ఇవే..

బుల్లెట్, పల్సర్​ బండ్లుంటే జాగ్రత్త.. దొంగల టార్గెట్ ఇవే..
  •     బైక్​లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​
  •     తెలంగాణలో చోరీ చేసి ఏపీలో.. ఏపీలో చోరీ చేసి తెలంగాణలో అమ్మకం
  •     కటకటాల్లోకి నెట్టిన నల్గొండ పోలీసులు

నల్గొండ, వెలుగు : నల్గొండ పోలీసుల చేతికి ఓ అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా చిక్కింది. వారి వద్ద 90 లక్షల విలువైన 67 బైక్‌లు, బొమ్మ పిస్టల్, 5 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ చందనా దీప్తి, ఏఎస్పీ రాములునాయక్‌  సోమవారం వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా చిలుకలూరి పేటకు చెందిన తుపాకుల వెంకటేశ్, కనిగిరికి చెందిన గువ్వల శబరీశ్, చిలకలూరిపేటకు చెందిన గుంజి అంకమ్మరావు, పిడుగురాళ్ల మండలం జానపాడ్‌కు చెందిన మెట్టుపల్లి శ్రీకాంత్, చిలకలూరిపేట మండలం కావూరుకు చెందిన ఆవుల వేణు పాత నేరస్తులు.

వీళ్లకు జైలులో పరిచయం ఏర్పడింది. వీరంతా బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడ్డారు. రాత్రి పూట ఇంటి ముందు పార్కు చేసిన బైక్‌లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవారు. ఇప్పటిదాకా 67 బైక్‌లు దొంగనతం చేయగా అందులో 20 బుల్లెటు బైక్‌లు, 44 పల్సర్‌ బండ్లు, టీవీఎస్‌ అపాచి, యాక్టివా, సీడీ డీలక్స్‌ బైక్‌లు ఉన్నాయి. తెలంగాణలో చోరీ చేసిన బైక్‌లను ఏపీలో, అక్కడ చోరీ చేసిన బైక్‌లను తెలంగాణలో అమ్మేవారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి, నకిరేకల్, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి ప్రాంతాల్లో..

ఏపీలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, చిలకలూరి పేట, ఎడ్లపాడ్, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో చోరీలు చేశారు.  దొంగతనం చేసేప్పుడు ఎవరైనా అడ్డగిస్తే శబరీష్‌  బొమ్మ పిస్టల్​తో బెదిరించేవాడు. నల్లగొండలో బైక్‌లు పోయాయని ముగ్గురు టూటౌన్‌ పోలీసులకు కంప్లయింట్​ఇవ్వగా ఎస్‌ఐ నాగరాజు స్పెషల్​ టీమ్​తో గాలించారు. పానగల్‌ బైపాస్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొందరు అనుమానాస్పదంగా కనిపించారు. సోదా చేయగా బొమ్మ పిస్టల్​ దొరికింది.

విచారించగా బైక్‌ల దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది విష్ణువర్ధన్‌గిరి, లావూరి బాలకోటి, లింగస్వామి, మహేశ్​లకు ఎస్పీ ప్రశంశాపత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ డానియెల్‌ పాల్గొన్నారు.