ముందు ఎస్కార్ట్ కారు.. వెనకాల గంజాయి లారీ

ముందు ఎస్కార్ట్ కారు..  వెనకాల గంజాయి లారీ
  • ఏపీ నుంచి మహారాష్ట్రకు  ట్రాన్స్ పోర్ట్
  • జడ్చర్లలో టీ న్యాబ్ నిఘాకు పట్టుబడిన ముఠా
  • 208 కిలోల గంజాయి, లారీ,కారు సీజ్ 
  • టీ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి 

హైదరాబాద్,వెలుగు : ఎస్కార్ట్ పెట్రోలింగ్ తో గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల ముఠా వద్ద 208 కిలోల గంజాయితో పాటు లారీ, కారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. కోటి ఉంటుందని అంచనా వేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ వివరాలను టీ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి ఆదివారం వెల్లడించారు.

ట్రిప్పుకు రూ.2లక్షలు కమీషన్

మహారాష్ట్ర ఉస్మాన్ బాద్ మండ్వాకు చెందిన రాజు అంబదాస్ షేండే(30) ఆటో డ్రైవర్ గా చేసేవాడు. ఉస్మాన్​ బాద్ కు చెందిన ఓ గంజాయి సప్లయర్ అంబదాస్ తో ఏపీలోని విజయనగరం పరిధి పార్వతీపురం నుంచి పుణె కు గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేయాలని, ఇందుకు ఒక్కో ట్రిప్ కు రూ.2 లక్షలు కమీషన్ ఇస్తానని ఆశచూపాడు. దీంతో  అంబదాస్ తన బంధువులైన బాలాజీ అర్జున్(24), నిఖిల్ నందకుమార్(27), మధుకర్ అర్జున్ కాలే(18), సంజయ్ రవీంద్ర చౌహన్(25)లతో కలిసి గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు స్కెచ్ వేశారు. 

లారీ క్యాబిన్ లో స్పెషల్ బాక్సులు

రాజు అంబదాస్  ముఠా ముందుగా ఓ లారీని అద్దెకు తీసుకుని, ఇంజిన్ క్యాబిన్ లో ప్రత్యేక బాక్స్ లు ఏర్పాటు చేయించాడు.లారీ ముందు ఎస్కార్ట్ గా వచ్చేందుకు కారును ఎంగేజ్ చేసుకుంది. పార్వతీపురంలో స్థానిక ఏజెంట్ వద్ద ఒక్కో ప్యాకెట్ లో 2 కిలోలు ప్యాక్ చేసిన 104 గంజాయి ప్యాకెట్స్ తీసుకుంది.  గంజాయి తీసుకుని వస్తుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అందించిన సమాచారంతో స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అలర్ట్ అయ్యింది.

జడ్చర్ల సమీపంలో ..

విజయనగరం పరిధి పార్వతీపురం నుంచి బయలుదేరిన లారీకి ముందుగా ఎస్కార్ట్ కారు నంబర్లను టీ న్యాబ్ పోలీసులు సేకరించారు. గుంటూరు,  మాచర్ల, మల్లేపల్లి, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల మీదుగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. డీఎస్పీ నర్సింగ్ రావు, ఇన్ స్పెక్టర్ రాజేశ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని నక్కలబండ తండా వద్ద నిఘా పెట్టారు. ఎస్కార్ట్ గా వచ్చిన కారులో  రాజు అంబదాస్ షేండే, బాలాజీ అర్జున్, నిఖిల్ నందకుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. వెనుకాలే వచ్చిన లారీలో మధుకర్ అర్జున్ కాలే, సంజయ్ రవీంద్ర చౌహన్ ను అరెస్ట్ చేశారు.