
- విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో అవకాశాలు: ఎంపీ వంశీకృష్ణ
- రైల్వే, రోడ్డు వసతులున్నయ్
- వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వ్యాఖ్య
పెద్దపల్లి, వెలుగు: ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్లకు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లోని పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలు అనుకూలమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో దుబాయ్ లోని ఇన్వెస్టర్లతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని వనరుల గురించి ఇన్వెస్టర్లకు వివరించారు.
బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్లు వంటి మౌలిక వసతులు ఉన్న ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గనులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ వ్యాపారవర్గాలను ఎంపీ వంశీకృష్ణ ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేషనల్ కో ఆర్డినేటర్‌గా ఎంపీ వంశీకృష్ణ
- 45 మంది జాబితాను రిలీజ్ చేసిన ఏఐసీసీ
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేషనల్ కోఆర్డినేటర్ గా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అధిష్టానం నియమించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మొత్తం 45 మంది కో ఆర్డినేటర్ల నియామకానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ జాబితాను మంగళవారం ఏఐసీసీ నేషనల్ (సంస్థాగత) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
గడ్డం వంశీతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన జంగా గౌతమ్ కు సైతం ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ గా అవకాశం కల్పించారు. అలాగే, మిగిలిన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు, ముఖ్యమైన నాయకులు ఉన్నారు. వీరితో పాటు అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ (కేకేసీ)కి వైస్ చైర్మన్లు, సెక్రటరీలు, రీజినల్ కో ఆర్డినేటర్లను హైకమాండ్ నియమించింది.