ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ స‌‌మిట్‌‌లో రక్షా ఎక్స్‌‌పో.. ప్రపంచ స్థాయి కంపెనీలకు సీఎస్ సంజయ్ జాజు ప్రత్యేక ఆహ్వానం

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ స‌‌మిట్‌‌లో రక్షా ఎక్స్‌‌పో.. ప్రపంచ స్థాయి కంపెనీలకు సీఎస్ సంజయ్ జాజు ప్రత్యేక ఆహ్వానం

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్–2026’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు వెల్లడించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘న్యూస్18 డిఫ్‌‌కాన్ 2026’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమిట్‌‌లో భాగంగా  తెలంగాణ.. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ ఎగుమతుల్లో సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేలా ప్రత్యేకంగా ‘రక్షా ఎక్స్‌‌పో 2026’ను ఏర్పాటు చేయనున్నట్లు సంజయ్ జాజు తెలిపారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం ఏరోస్పేస్, డిఫెన్స్ ఎగుమతుల్లో ఏకంగా 103 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. రాష్ట్రంలో బలమైన పరిశ్రమలు, వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌‌ఎంఈలు) ఉన్నాయని, డ్రోన్లు, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో తెలంగాణ వేగంగా దూసుకుపోతోందని వివరించారు. ఈ ఎక్స్‌‌పో ద్వారా ప్రపంచ స్థాయి రక్షణ రంగ కంపెనీలు, తయారీదారులు, స్టార్టప్‌‌లు తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆయన ఆహ్వానించారు.

తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాలు, ప్రత్యేక ఇంజనీరింగ్ టెస్ట్‌‌లు, జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని గ్లోబల్ కంపెనీలకు పిలుపునిచ్చారు. ఈ సమిట్‌‌లో ప్రత్యేకంగా ఏరోస్పేస్ సదస్సులు, అద్భుతమైన ఎయిర్ షోలు, లైవ్ ప్రదర్శనలతో పాటు డ్రోన్లు, రక్షణ పరికరాలను ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. అలాగే దేశీయ, విదేశీ వ్యాపారవేత్తల మధ్య ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశాలు (బీ2బీ మీటింగ్స్) ఏర్పాటు చేసి, మన స్థానిక కంపెనీలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు.