- ఎల్‌టీసీజీ లిమిట్‌ను రూ.2 లక్షలకు పెంచాలని నిపుణుల సూచన
- ఎస్‌టీటీ పెంచొద్దని వినతి
- డివిడెండ్, షేర్ బైబ్యాక్ పన్నుల్లో మార్పులు అవసరం
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఈ ఏడాది బడ్జెట్‌పై చాలా ఆశలతో ఉన్నారు. ఈసారైనా లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) మినహాయింపు పరిమితిని పెంచుతారని భావిస్తున్నారు. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో ఎల్‌టీసీజీ మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1.25 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచించింది.
అదనంగా, అన్ని ఆస్తి తరగతులకు (ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్) "లాంగ్ టర్మ్" నిర్వచనాన్ని 12 నెలలుగా ప్రమాణీకరించాలని, అలాగే క్యాపిటల్ లాస్‌ను ఇతర ఆదాయాలపై సెట్ ఆఫ్ చేసుకునే (ఐటీఆర్ టైమ్‌లో ఇతర ఆదాయాల నుంచి తగ్గించుకునేలా) అవకాశం ఇవ్వాలని కోరింది.
మార్కెట్ వర్గాలు ట్రాన్సాక్షన్ పన్నులను మరింత పెంచకూడదని హెచ్చరించాయి. క్యాష్ ఈక్విటీ ట్రేడ్స్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ)ని డెరివేటివ్స్ కంటే తక్కువగా ఉంచాలని, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇది అవసరమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీఈఓ ధీరజ్ రెల్లీ అన్నారు.
షేర్ బైబ్యాక్‌లలో లాభ భాగంపై మాత్రమే పన్ను విధించాలని, డివిడెండ్ పన్ను రేట్లను దేశీయ పెట్టుబడిదారులకు ఎన్‌ఆర్‌ఐలతో సమానంగా చేయాలని సూచించారు. ఎస్‌టీటీని ఇకపై పెంచకూడదని, లాంగ్-టర్మ్, షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును 10శాతానికి తగ్గిస్తే మార్కెట్‌లో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతుందని బ్రోకరేజ్ కంపెనీ ఫైయర్స్ సీఈఓ తేజస్ ఖోదే అన్నారు.
బంగారం, వెండి దిగుమతి సుంకాలను పెంచకూడదని, ఇవి మార్కెట్ అస్థిరత, రూపాయి విలువ తగ్గుదలపై హెడ్జింగ్‌కు కీలకమని పేర్కొన్నారు. కాగా, యూనియన్ బడ్జెట్ రోజు ఆదివారమైనా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు ప్రత్యేకంగా లైవ్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి.
ఎంట్రీ లెవల్ ఈవీలకు ప్రోత్సాహం ఇవ్వండి
ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల)కు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే ఫ్లీట్ సెగ్మెంట్ (క్యాబ్ సర్వీస్‌ల)లో ఉపయోగించే ఎలక్ట్రిక్ కార్లకు పీఎం ఈడ్రైవ్ పథకం కింద మద్దతు ఇవ్వాలని టాటా మోటార్స్ ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ప్రభుత్వం జీఎస్‌టీ 2.0, రెపో రేట్ తగ్గింపు, పన్ను విధాన మార్పులు వంటి చర్యలతో ప్యాసింజర్ వెహికల్ పరిశ్రమలో డిమాండ్‌ను పునరుద్ధరించింది. కానీ ఎంట్రీ-లెవల్ ఈవీలు ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి”అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ, సీఈఓ శైలేష్ చంద్ర తెలిపారు.
జీఎస్‌టీ సంస్కరణలతో పెట్రోల్ కార్ల ధరలు తగ్గడం వల్ల ఈవీలపై ఒత్తిడి పెరిగిందని ఆయన అన్నారు. మొత్తం పీవీ అమ్మకాలలో ఫ్లీట్ సెగ్మెంట్‌లోని ఈవీల వాటా 7శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ప్యాసింజర్లు ప్రయాణించిన దూరంలో 33-35శాతం వాటా వీటి నుంచే ఉందని వివరించారు.
ఒక ఫ్లీట్ కారు సాధారణ కారు కంటే ఐదు రెట్లు ఎక్కువ నడుస్తుందని, అందువల్ల ఈ విభాగానికి మద్దతు ఇవ్వడం పర్యావరణ పరంగా, ఆయిల్ దిగుమతుల పరంగా పెద్ద ప్రభావం చూపుతుందని ఆయన సూచించారు. ఫ్లీట్ ఈవీలు ఫేమ్-2 పథకంలో భాగమైనప్పటికీ, పీఎం ఈడ్రైవ్‌లో చేరలేదని, ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ధరల పెంపు విషయమై ఆయన, కరెన్సీ మారక సమస్యలు, ముడి సరుకుల ధరల పెరుగుదల కంపెనీ ఆదాయంపై 2శాతం ప్రభావం చూపుతున్నాయని, త్వరలో ధరల పెంపు నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక ఆటోమేకర్లు ధరలు పెంచినట్లు ఆయన గుర్తుచేశారు.
