- మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే సెన్సెక్స్1,048 పాయింట్లు పతనం
- 1.30 శాతం నష్టపోయిన నిఫ్టీ భారీ అమ్మకాలతో సూచీలు కుదేలు
- ఇన్వెస్టర్లకు రూ.7.02 లక్షల కోట్ల నష్టం పది నెలల కనిష్టానికి ఐటీ ఇండెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. రూ.లక్షల కోట్ల సంపద ఆవిరయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మెటల్, ఐటీ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వల్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1,048.16 పాయింట్లు పతనమై 82,626.76 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 336.10 పాయింట్లు నష్టపోయి 25,471.10 వద్ద స్థిరపడింది. ఏఐ వల్ల ఐటీ రంగంలో వచ్చే ఆటంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం మదుపర్ల నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఐటీ ఇండెక్స్ ఈ సెషన్లో పది నెలల కనిష్టానికి పడిపోయింది. డే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,140.37 పాయింట్లు పతనమై కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో 2,960 షేర్లు నష్టాల్లో ఉండగా, 1,253 షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
దీనివల్ల ఇన్వెస్టర్ల సంపద రూ.7.02 లక్షల కోట్లు ఆవిరైపోయి రూ.465.46 లక్షల కోట్లకు చేరింది. హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, రిలయన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు భారీగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.90 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్1.19 శాతం తగ్గింది. బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాలపాలయ్యాయి.
ఐటీ స్టాక్స్‌పై ఒత్తిడి
అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన టూల్స్ వల్ల భారత ఐటీ సేవలకు డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనలు పెరిగాయి. దీనిని 'ఆంథ్రోపిక్ షాక్' అని పిలుస్తున్నారు. దీనివల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఏడు శాతం వరకు పడిపోయాయి. అమెరికాలో నిరుద్యోగిత రేటు తగ్గడం, ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉండటంతో, యూఎస్ ఫెడ్ ప్రస్తుతానికి వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
అమెరికా నాస్డాక్ ఇండెక్స్ భారీగా పడిపోవడంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడింది. ముఖ్యంగా టెక్నాలజీ షేర్లలో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు కొనసాగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలపడటం, రూపాయి విలువ రూ.90.64 వద్ద బలహీనపడటం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు.
మిడిల్ఈస్ట్ దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా మరో యుద్ధనౌకను ఇరాన్‌వైపు పంపుతుందన్న వార్తలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి.
