బ్యాటింగ్‌‌పై పంత్ మరింత క్లారిటీతో ఉండాలి

బ్యాటింగ్‌‌పై పంత్ మరింత క్లారిటీతో ఉండాలి

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వారసుడు రిషబ్ పంత్ అని చాలా మంది భావించారు. ఐపీఎల్‌‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో కొన్ని స్టన్నింగ్ ఇన్నింగ్స్‌‌లు ఆడిన పంత్‌‌కు మంచి భవిష్యత్ ఉందని క్రికెట్ ఎక్స్‌‌పర్ట్స్ అంచనా వేశారు. అయితే ఈమధ్య వరుస వైఫల్యాలతో పంత్ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. పంత్ పెర్ఫామెన్స్‌‌పై టీమిండియా మాజీ బ్యాట్స్‌‌మన్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. సొంత గేమ్‌‌‌‌తోపాటు టీమ్‌‌లో తన బాధ్యతలు, పాత్రను గుర్తించడంలో పంత్ విఫలమవుతున్నాడని ఆకాశ్ చెప్పాడు.

‘పంత్ తన సొంత గేమ్‌‌ విషయంలో చాలా గందరగోళానికి గురవుతున్నాడు. తన శైలిలో ఆడటంలో అతడు కంఫర్ట్‌‌గా కనిపించడం లేదు. పంత్ చివరగా ఆడిన కొన్ని టెస్టు మ్యాచులు, ఈ సీజన్ ఐపీఎల్‌‌లో పెర్ఫామెన్స్ చూస్తే అతడిలో నిలకడ లోపించడాన్ని గమనించొచ్చు. బాల్‌‌ను గట్టిగా, ఎక్కువ దూరం బాదే సామర్థ్యం పంత్ సొంతం. కానీ ఎప్పుడు హిట్టింగ్‌‌కు వెళ్లాలనే విషయంలో అతడిలో క్లారిటీ మిస్సవుతోంది. గతంలో బౌలర్లను అతడు నిలదొక్కుకోనివ్వలేదు. కానీ ఈ సీజన్‌‌లో ఆ బౌలర్లే పంత్‌‌పై ఆధిపత్యం చూపిస్తున్నారు. పంత్ తన ఆటపై మరింత ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. తన సొంత గేమ్‌‌ను, మ్యాచ్ పరిస్థితులపై అవగాహనను పెంచుకోవాలి. పంత్ తన కెరీర్‌‌లో రెండో స్టేజ్‌‌లో ఉన్నాడు. ఇది ఆటను మరింతగా అర్థం చేసుకుని నేర్చుకునే దశ. ఎంత త్వరగా ఈ ఫేజ్‌‌ను పంత్ అధిగమిస్తే ఇండియన్ క్రికెట్‌‌కు అంతగా పనికొస్తాడు’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.