ఎనిమిదేళ్లలో ఒక్క ట్రోఫీ నెగ్గరా?.. కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవాలి

ఎనిమిదేళ్లలో ఒక్క ట్రోఫీ నెగ్గరా?.. కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవాలి

న్యూఢిల్లీ: ఐపీఎల్ ట్రోఫీ వేటలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోమారు విఫలమైంది. టోర్నీ ఆరంభంలో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ ఆ ఊపును చివరి వరకు కొనసాగించలేకపోయింది. ఎలాగోలా ప్లేఆఫ్స్‌‌కు చేరుకున్న విరాట్ సేన.. సన్ రైజర్స్ హైదరాబాద్‌‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ఓడిపోయింది. తద్వారా ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ఐపీఎల్‌‌లో కప్పు గెలవని మూడు జట్లలో ఆర్సీబీ ఒకటిగా ఉంది. ఆర్సీబీ ఓటమిపై కోహ్లీ టార్గెట్‌‌గా విమర్శలు ఎక్కువయ్యాయి. ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవాలని టీమిండియా వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.

‘ఫలితాలకు బాధ్యత తీసుకోవాల్సిన తరుణమిది. కోహ్లీ కెప్టెన్‌‌గా తప్పుకోవాలి. ఎనిమిదేళ్లలో ఆర్సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయింది. ఎనిమిదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. ఇంత టైమ్ కెప్టెన్‌‌గా లేదా ఒక జట్టు ప్లేయర్‌‌గా ఉండి ట్రోఫీ నెగ్గని వాళ్లు ఒక్కరూ లేరు. కెప్టెన్‌‌గా కోహ్లీకి జవాబుదారీతనం ఉండాలి. నాకు వ్యక్తిగతంగా విరాట్‌‌పై ఎలాంటి కోపం, ద్వేషం లేదు. కానీ ఆర్సీబీ ఓటములకు కోహ్లీ బాధ్యతలు తీసుకోవాల్సిందేనని చెబుతా. పంజాబ్‌‌కు అశ్విన్ రెండేళ్లు కెప్టెన్‌‌గా ఉన్నాడు. కప్ రాకపోవడంతో అతడ్ని టీమ్‌‌ నుంచే తీసేశారు. ధోని ఖాతాలో మూడు టైటిళ్లు, రోహిత్ అకౌంట్‌‌లో నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. అందుకే వాళ్లు చాలా రోజుల నుంచి కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. కెప్టెన్‌‌గా ఉంటే ప్రశంసలతోపాటు విమర్శలనూ స్వీకరించాల్సిందే’ అని గంభీర్ పేర్కొన్నాడు.