
దుబాయ్: ఐపీఎల్‌లో చాన్నాళ్లుగా పేలవంగా ఆడుతూ వచ్చిన ఢిల్లీ జట్టు ఈసారి విజృంభిస్తోంది. వరుస విజయాలతో సత్తా చాటుతోంది. బ్యాట్స్‌మన్ రాణింపుతోపాటు పేస్ గుర్రాలు కగిసో రబాడ, ఆన్రిచ్ నార్జే వికెట్లతో చెలరేగుతుండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళ్తోంది. ఈ సీజన్‌లో ఆన్రిచ్ నార్జే మంచి పేస్‌తో బౌలింగ్ వేస్తూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. సగం టోర్నీ ముగిసేసరికి 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈలో బౌలింగ్ కండీషన్స్‌తో పాటు కోహ్లీ, రోహిత్ శర్మ గురించి నార్జే పలు విషయాలు పంచుకున్నాడు.
‘బౌలింగ్ సాధ్యమైనంత సింపుల్‌గా ఉండేలా చూసుకుంటున్నా. ఎవరికి బౌలింగ్ చేస్తున్నామనే దాని కంటే మన ప్లాన్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేయడమే ముఖ్యం. అలాగే గుడ్ లెంగ్త్ చాలా కీలకం. సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తే రోహిత్, కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్‌కూ వాటిని ఎదుర్కోవడం కష్టమవుతుంది. నేను బౌన్సర్లతో బ్యాట్స్‌మన్‌ను ఆశ్చర్యపరుస్తుంటా. ఫాస్ట్ బౌలర్లు తమ వేగంతో బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి తగ్గేలా చేయాలి. వేగం, లెంగ్త్ నా ప్రధాన ఆయుధం’ అని నార్జే చెప్పాడు. ఈ సీజన్‌లో 155, 156 కి.మీ.ల వేగంతో బంతులు వేసిన ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఐపీఎల్‌లో నార్జే పేరు తెచ్చుకున్నాడు.