ఫేజ్‌ 2లో చెన్నై బోణీ.. ముంబైపై 20రన్స్‌ తేడాతో విక్టరీ

V6 Velugu Posted on Sep 20, 2021

1/1, 2/2, 7/3 మూడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై ఆట సాగిన తీరిది. కరీబియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌లో చెలరేగి ఆడిన డుప్లెసిస్‌‌, ఇంగ్లండ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ మొయిన్‌‌ అలీ సున్నా చుట్టగా.. అంబటి రాయుడు కూడా ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. కెప్టెన్‌‌, ధోనీ,  వైస్‌‌ కెప్టెన్  రైనా సింగిల్‌‌ డిజిట్స్‌‌కే పెవిలియన్‌‌ చేరారు.  పవర్‌‌ ప్లేలో 24 పరుగులకే ఐదుగురు బ్యాట్స్‌‌మెన్‌‌ డగౌట్‌‌లోకి వచ్చేయడంతో  సీఎస్‌‌కే వంద పరుగులు చేస్తే గొప్ప అనుకున్న ఈ పరిస్థితుల్లో యంగ్‌‌ ఓపెనర్‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (58 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 4  సిక్సర్లతో 88 నాటౌట్‌‌) ఆపద్బాంధవుడయ్యాడు. ముంబై పవర్‌‌ఫుల్‌‌ పేస్‌‌, స్పిన్‌‌ బౌలింగ్‌‌ను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఖతర్నాక్‌‌ షాట్లతో ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు. ఆపై, పేసర్లు డ్వేన్‌‌ బ్రావో, దీపక్‌‌ చహర్‌‌ బౌలింగ్‌‌లో అదరగొట్టడంతో చిన్న టార్గెట్‌‌ను అద్భుతంగా డిఫెండ్‌‌ చేసుకున్న ధోనీసేన ఫేజ్‌‌2ను విక్టరీతో షురూ చేసింది. ఓవరాల్‌‌గా ఆరో విక్టరీతో టాప్‌‌ ప్లేస్‌‌కు దూసుకెళ్లింది. గాయపడ్డ కెప్టెన్‌‌ రోహిత్‌‌, ఆల్​రౌండర్​ హార్దిక్​ లేకుండా ఆడిన ముంబై వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక చేజేతులా ఓడింది..!

దుబాయ్‌‌: ఐపీఎల్‌‌14 రెండో దశను చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ అదిరిపోయే విజయంతో ఆరంభించింది. యంగ్​స్టర్​  రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ వీరోచిత బ్యాటింగ్‌‌కు డ్వేన్‌‌ బ్రావో (23, 3/25) ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌, దీపక్‌‌ చహర్‌‌ (2/19) పవర్‌‌ఫుల్‌‌ బౌలింగ్‌‌ తోడవడంతో ఆదివారం ఇక్కడ జరిగిన ఫేజ్‌‌2 ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో సీఎస్‌‌కే 20 రన్స్‌‌ తేడాతో ముంబై ఇండియన్స్‌‌ను ఓడించింది. టాస్‌‌ నెగ్గి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన సీఎస్‌‌కే 20 ఓవర్లలో 156/6 స్కోరు చేసింది.  రవీంద్ర జడేజా (33 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌తో26), డ్వేన్‌‌ బ్రావో (8 బాల్స్‌‌లో 3సిక్సర్లతో 23) కూడా రాణించారు. ముంబై బౌలర్లలో ఆడమ్‌‌ మిల్నే (2/21), జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా (2/33), ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (2/35) తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం సీఎస్‌‌కే పదునైన బౌలింగ్‌‌కు వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబై ఓవర్లన్నీ ఆడి 136/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. సౌరభ్‌‌ తివారీ (40 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 50 నాటౌట్‌‌) ఫిప్టీ చేసినా మిగతా బ్యాట్స్‌‌మెన్‌‌ ఫెయిలయ్యారు. బ్రావో, దీపక్‌‌కు తోడు శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (1/29) హేజిల్‌‌వుడ్‌‌ (1/34) చెరో వికెట్‌‌ తీశారు. రుతురాజ్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

గైక్వాడ్‌‌ ఒక్కడే

చెన్నై ఇన్నింగ్స్‌‌లో రుతురాజే హీరో. టాప్‌‌–6లో ఐదుగురు బ్యాట్స్‌‌మన్‌‌ వరుసగా 0, 0, 0, 4, 3 స్కోర్లతో నిరాశ పరిచినా అతనొక్కడే అద్భుత ఆటతో అదరగొట్టాడు. సీనియర్లు ఫెయిలైన చోట ఎంతో ఓపిగ్గా, క్లాసిక్‌‌ షాట్లతో ఇన్నింగ్స్‌‌ను నిర్మించాడు. చివర్లో జడేజా, బ్రావో అతనికి సపోర్ట్‌‌ ఇవ్వడంతో సీఎస్‌‌కే గౌరవప్రద స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌లో ముంబై పేసర్లు ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, ఆడమ్‌‌ మిల్నే చెన్నై నడ్డి విరిచారు. బౌల్ట్​ ఇన్నింగ్స్‌‌ ఐదో బాల్‌‌కే డుప్లెసిస్‌‌ (0) ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. మిల్నే వేసిన తర్వాతి ఓవర్లో  చెన్నైకి డబుల్‌‌ స్ట్రోక్ తగిలింది.  మొయిన్‌‌ అలీ (0).. కవర్‌‌ పాయింట్‌‌లో తివారీకి క్యాచ్‌‌ ఇవ్వగా, మిల్నే షార్ట్‌‌  బాల్‌‌ మోచేతికి బలంగా తగలడంతో రాయుడు (0) రిటైర్డ్‌‌ హర్ట్‌‌ అయ్యాడు. తర్వాతి ఓవర్లో  ఓ ఫోర్ కొట్టిన రైనా (4)... బౌల్ట్‌‌ బాల్‌‌కు నిర్లక్ష్యమైన షాట్ ఆడి రాహుల్‌‌ చహర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. మరో ఎండ్‌‌లో రుతురాజ్‌‌ ఓవర్‌‌కో బౌండ్రీతో క్రీజులో కుదురుకోగా... ఆరో ఓవర్లో ధోనీ (3)ని ఔట్‌‌ చేసిన మిల్నే చెన్నైని భారీ దెబ్బ కొట్టాడు. వరుసగా వికెట్లు పడడంతో రుతురాజ్‌‌,  జడేజా కాసేపు జాగ్రత్త పడ్డారు. దాంతో, 11 ఓవర్లకు సీఎస్‌‌కే 48/4 స్కోరు మాత్రమే చేసింది. 9వ ఓవర్లో తన  క్యాచ్‌‌ను ముంబై కీపర్‌‌ డికాక్‌‌ డ్రాప్‌‌ చేయడంతో బతికిపోయిన రుతురాజ్‌‌.. 12వ ఓవర్లో ఒక్కసారిగా గేరు మార్చాడు. స్పిన్నర్‌‌ క్రునాల్‌‌ బౌలింగ్‌‌లో లాంగాఫ్‌‌ మీదుగా భారీ సిక్స్, మరో ఫోర్‌‌ కొట్టాడు. జడేజా కూడా ఓ బౌండ్రీ బాదడంతో ఆ ఓవర్లో 18 రన్స్‌‌ వచ్చాయి. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని గైక్వాడ్‌‌.. పొలార్డ్‌‌ వేసిన 16వ ఓవర్లో మరో రెండు ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆపై బుమ్రా బౌలింగ్‌‌లో సిక్స్‌‌ రాబట్టాడు. అదే ఓవర్లో జడ్డూ ఔటవగా.. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రావో చివర్లో ధనాధన్‌‌ షాట్లతో అలరించాడు. మిల్నే బౌలింగ్‌‌లో సిక్స్‌‌ కొట్టిన బ్రావో.. బౌల్ట్‌‌ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. రుతురాజ్‌‌ కూడా 4,6 కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 24  రన్స్‌‌ వచ్చాయి. లాస్ట్‌‌ ఓవర్లో బ్రావో ఔటైనా.. గైక్వాడ్‌‌ 4, 6తో ఇన్నింగ్స్‌‌కు ఫినిషింగ్‌‌ టచ్ ఇచ్చాడు. 

ముంబై తడబ్యాటు..

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ముంబై స్టార్టింగ్‌‌ నుంచే తడబడింది. కెప్టెన్‌‌ రోహిత్‌‌ లేని లోటు టాపార్డర్‌‌లో కొట్టొచ్చినట్టు కనిపించింది.  పవర్‌‌ ప్లే బౌలర్‌‌గా పేరున్న సీఎస్‌‌కే యంగ్‌‌ పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌ స్టార్టింగ్‌‌లోనే ఓపెనర్లు డికాక్‌‌ (17), అన్మోల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (16)ను ఔట్‌‌ చేసి ముంబైని దెబ్బకొట్టాడు. థర్డ్‌‌ ఓవర్లో డికాక్‌‌ వికెట్ల ముందు దొరికిపోగా.. హేజిల్‌‌వుడ్‌‌ బౌలింగ్‌‌లో 4, 6, 4తో దూకుడు మీద కనిపించిన డెబ్యూ ప్లేయర్‌‌ అన్మోల్‌‌ప్రీత్‌‌..దీపక్‌‌ నకుల్‌‌ బాల్‌‌కు క్లీన్‌‌ బౌల్డ్‌‌ అయ్యాడు. ఇక,  ఇంగ్లండ్‌‌ టూర్‌‌లో అదరగొట్టిన శార్దూల్‌‌ ఠాకూర్‌‌.. ఆరో ఓవర్లో  కీలక ఆటగాడు సూర్యకుమార్‌‌ (3) వికెట్‌‌ తీయడంతో పవర్‌‌ ప్లేలో ముంబై 41/3తో నిలిచింది. ఈ దశలో  సౌరభ్‌‌ తివారితో కలిసి నెమ్మదిగా ఆడిన ఇషాన్‌‌ కిషన్‌‌ (11)ను పదో ఓవర్లో బ్రావో వెనక్కుపంపాడు. స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ పొలార్డ్‌‌ (15) ఓ ఫోర్‌‌, సిక్స్‌‌తో ముంబైని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, 14వ ఓవర్లో గుడ్‌‌లెంగ్త్‌‌ బాల్‌‌తో అతడిని ఎల్బీ చేసిన హేజిల్‌‌వుడ్‌‌ సీఎస్‌‌కే శిబిరంలో జోష్‌‌ నింపాడు. తర్వాతి ఓవర్లో క్రునాల్‌‌ (4) రనౌటవడంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. చివరి ఐదు ఓవర్లలో  ఆ టీమ్​కు 53 రన్స్‌‌ అవసరం అయ్యాయి. క్రీజులో కుదురుకున్న తివారీతో పాటు ఆడమ్‌‌ మిల్నే (15) వేగంగా ఆడలేకపోయారు. లాస్ట్ ఓవర్లో 24రన్స్‌‌ అవసరం అవగా.. మిల్నేతో పాటు రాహుల్‌‌ చహర్‌‌(0) వికెట్లు తీసి మూడు రన్సే ఇచ్చిన బ్రావో సీఎస్‌‌కేకి గ్రాండ్‌‌ విక్టరీ అందించాడు.  
 

Tagged ipl 2021, Ruturaj Gaikwad, 20 runs, Chennai Super Kings won, Mumbai Indians

Latest Videos

Subscribe Now

More News