నేటి, రేపటి మ్యాచ్‌‌ల వాయిదా ?

V6 Velugu Posted on May 04, 2021

  • మ్యాచులు పెట్టాలా ? వద్దా ? 
  • డైలమాలో క్రికెట్ బోర్డు
  • మ్యాచులు రీషెడ్యూల్ చేసే అవకాశం

ఢిల్లీ: ఊహించని విధంగా ఇద్దరు ప్లేయర్లు, ఓ కోచ్‌‌ కరోనా బారిన పడడంతో ఐపీఎల్‌‌ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఓ మ్యాచ్‌‌ను వాయిదా వేసిన బోర్డు..   లీగ్‌‌ను కొనసాగిస్తామని అంటున్నప్పటికీ  అది సజావుగా సాగేలా లేదు. మరికొన్ని మ్యాచ్‌‌లను రీషెడ్యూల్‌‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఢిల్లీ వేదికగా  మంగళవారం ముంబై–హైదరాబాద్‌‌, బుధవారం రాజస్తాన్‌‌–చెన్నై మ్యాచ్‌‌లు కూడా ఆగిపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. ముంబై, సన్​రైజర్స్​ టీమ్స్​ సోమవారం తమ ప్రాక్టీస్​ను రద్దు చేసుకోవడం దీనికి బలం చేకూరుస్తోంది.  ప్రస్తుతం కోల్‌‌కతా ప్లేయర్లు ఆరో రోజుల స్ట్రిక్ట్​ క్వారంటైన్‌‌లోకి వెళ్లారు. సీఎస్‌‌కే ప్లేయర్లంతా నెగెటివ్‌‌గా తేలినప్పటికీ కోచ్‌‌ బాలాజీతో క్లోజ్‌‌ కాంటాక్ట్‌‌ నేపథ్యంలో వాళ్లు కూడా ఆరో రోజుల ఐసోలేషన్‌‌కు వెళ్లొచ్చు.  ‘సాధారణంగా వైరస్‌‌ బాడీలోకి ఎంటరైన ఐదు లేదా ఆరో రోజే సింప్టమ్స్‌‌ బయట పడతాయి. కాబట్టి ఢిల్లీలో తర్వాతి రెండు మ్యాచ్‌‌లు జరపడం సురక్షితమేనా? కాదా? అన్న చర్చలు జరుగుతున్నాయి’ అని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్‌‌ స్టాండర్డ్‌‌ ఆపరేటింగ్‌‌ ప్రొసీజర్‌‌ ప్రకారం.. కరోనా పాజిటివ్‌‌తో క్లోజ్‌‌గా కాంటాక్ట్‌‌ అయిన వ్యక్తులు ఆరు రోజుల పాటు ఐసోలేషన్‌‌  ఉండి.. 1,3, 6వ రోజుల్లో మూడు నెగెటివ్‌‌ టెస్టులు వస్తేనే తిరిగి గ్రౌండ్‌‌లోకి అనుమతిస్తారు. కోల్​కతా తన తదుపరి మ్యాచ్​ ఈ నెల 8న ఢిల్లీతోనే ఆడనుంది.  ముందుకా.. వెనక్కా?    
మరోవైపు మొత్తం లీగ్‌‌ కొనసాగింపుపై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఐపీఎల్​కు ముందు  ఆర్​సీబీ ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్, ఢిల్లీ ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​​ వైరస్​ బారిన పడినా కోలుకున్నారు. కానీ లీగ్​మధ్యలో ప్లేయర్లకు వైరస్​ సోకడం ఇదే ఫస్ట్​ టైమ్​ కావడంతో బీసీసీఐ, ఐపీఎల్​ ఆందోళనలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్​ను కంటిన్యూ చేయాలా? వద్దా? అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, రాబోయే రోజుల్లో పాజిటివ్స్ సంఖ్య పెరిగితే ఏం చేయాలనే దానిపై చర్చలైతే మొదలయ్యాయి. ఇంటర్నేషనల్​ ట్రావెల్​ బ్యాన్​ నేపథ్యంలో.. ప్లేయర్లను సేఫ్​గా ఉంచేందుకు మరిన్ని చర్యలు చేపడతామని సీఈఓ హేమంగ్​ అమిన్​ ప్రకటించిన మూడు రోజుల్లోనే  ఇలా కావడంతో అందర్ని భయాందోళనలకు గురి చేస్తున్నది. కరోనా భయంతోనే ముగ్గురు ఆసీస్​ ప్లేయర్లు ఇప్పటికే లీగ్​ నుంచి వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయారు. తాజా పరిణామాలతో ఫారిన్‌‌ ప్లేయర్లలో ఆందోళన మరింత పెరిగిందని తెలుస్తోంది. వరుణ్‌‌, సందీప్‌‌ పాజిటివ్‌‌గా తేలడంతో పాటు తాజా సమాచారాన్ని  కేకేఆర్‌‌ పేసర్‌‌ ప్యాట్‌‌ కమిన్స్‌‌ ఆసీస్‌‌ ప్లేయర్లందరితో పంచుకున్నాడట. దాంతో వాళ్లు మరింత గాబరా పడుతున్నారని సమాచారం. కంగారూ ప్లేయర్లు కఠిన నిర్ణయాలు తీసుకుంటే లీగ్​ కొనసాగించడం ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే, సగం లీగ్‌‌ పూర్తయింది కాబట్టి ఇక వెనకడుగు వేయొద్దని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. టీమ్స్‌‌కు ఇబ్బంది లేనంతవరకు లీగ్‌‌ను కొనసాగించడమే బెస్ట్‌‌ అంటున్నాయి.  ‘ఒకవేళ టోర్నీని వాయిదా వేసినా ..ఎంతకాలం ఆపాలి?  కాబట్టి పాజిటివ్‌‌ ప్లేయర్లను ఐసోలేట్‌‌ చేసి టోర్నీని కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు’  అని ఓ ఫ్రాంఛైజీ అధికారి చెప్పారు.

కోల్‌‌కతా, బెంగళూరుకు వెళ్తే మరింత ప్రమాదం
ట్రావెలింగ్‌‌ వల్లే  ఐపీఎల్‌‌లో కరోనా టెన్షన్‌‌ మొదలైందని పలు ఫ్రాంచైజీలు అంటున్నాయి.  లీగ్‌‌ ఆరంభానికి ముందు వేర్వేరు దేశాలు, నగరాల నుంచి ప్లేయర్లు తమ టీమ్​లో జాయిన్​ అయ్యే క్రమంలో వైరస్‌‌ బారిన పడ్డారు. కానీ, చెన్నై, ముంబైలో ఆడుతున్నప్పుడు ఒక్క కేసు కూడా రాలేదు. అయితే, తొలి దశ ముగిసి ఏప్రిల్‌‌ లాస్ట్‌‌ వీక్‌‌లో ఫ్రాంచైజీలు అహ్మదాబాద్‌‌, ఢిల్లీ చేరుకునేందుకు ట్రావెల్‌‌ చేయడం వల్లే పరిస్థితి మారిందన్న అభిప్రాయాలున్నాయి. తదుపరి లీగ్‌‌ను కోల్‌‌కతా, బెంగళూరుకు షిఫ్ట్‌‌ చేస్తే మరింత ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే అని ఫ్రాంఛైజీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు సిటీల్లో వైరస్‌‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని అక్కడి ప్రజలే అంటున్నారు. కాబట్టి ప్లేయర్లతో పాటు అందరి హెల్త్‌‌ను రిస్క్‌‌లో పెట్టకూడదంటే బీసీసీఐ లీగ్‌‌ను ఆపేయాలని పలువురు సూచిస్తున్నారు.  కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు లీగ్‌‌ ఎంతో కొంత  ఉపశమనం కలిగిస్తుందని భావిస్తే మాత్రం ఒకే నగరంలో టోర్నీని పూర్తి చేయాలని, లేదంటే కొన్ని రోజులు బ్రేక్‌‌ ఇచ్చి తిరిగి కొనసాగించాలని అంటున్నారు. బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
 

Tagged corona effect, ipl 2021, covid effect, , today match, players positive, tomorrow matches, ipl postpone ?

Latest Videos

Subscribe Now

More News