బోణీ కొట్టిన కోల్ కతా..చెన్నైపై గ్రాండ్ విక్టరీ

బోణీ కొట్టిన కోల్ కతా..చెన్నైపై గ్రాండ్ విక్టరీ

   

  •     రాణించిన ఉమేశ్‌‌‌‌, రహానె
  •     ధోనీ హాఫ్‌‌ సెంచరీ వృథా

రెండేళ్ల తర్వాత ఇండియాలో ఫ్యాన్స్‌‌ మధ్యలో మొదలైన ఐపీఎల్‌‌ కొత్త సీజన్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ సత్తా చాటింది. కొత్త కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ నాయకత్వంలో ఆల్‌‌రౌండ్‌‌ షో చేసి తొలి పోరులోనే గెలిచి బోణీ కొట్టింది. గత ఫైనల్లో తమను ఓడించిన చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌పై ప్రతీకారం తీర్చుకుంది..! కెప్టెన్సీ వదులుకున్న  మహేంద్ర సింగ్‌‌ ధోనీ (38 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 50*)  ధనాధన్‌‌ ఆటతో హాఫ్‌‌ సెంచరీతో మెప్పించినా.. మిగతా బ్యాటర్లు ఫెయిలవడంతో చిన్న స్కోరుకే పరిమితమైన సీఎస్‌‌కే దాన్ని కాపాడుకోలేక లీగ్‌‌ను ఓటమితో షురూ చేసింది! 

ముంబై: పోయినేడాది ఫైనలిస్టుల మధ్య జరిగిన ఐపీఎల్‌‌‌‌‌‌ 15వ సీజన్‌‌‌‌ తొలి పోరులో చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌పై కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌దే పైచేయి అయింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన లో స్కోరింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో కేకేఆర్‌‌‌‌ ఆరు వికెట్ల తేడాతో సీఎస్‌‌‌‌కేను ఓడించింది.  తొలుత చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 రన్స్‌‌‌‌ చేసింది. ధోనీతో పాటు రాబిన్‌‌‌‌ ఊతప్ప (21 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28), కెప్టెన్‌‌‌‌ జడేజా (28 బాల్స్‌‌‌‌లో 1 సిక్స్‌‌‌‌తో 26 నాటౌట్‌‌‌‌) రాణించారు. కేకేఆర్‌‌‌‌ బౌలర్లలో ఉమేశ్‌‌‌‌ (2/20) రెండు వికెట్లు పడగొట్టాడు.  అనంతరం అజింక్యా రహానె (34 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 44) మెరుపులతో కోల్‌‌‌‌కతా 18.3ఓవర్లలోనే  133/4  స్కోరు చేసి గెలిచింది. డ్వేన్‌‌‌‌ బ్రావో (3/20) మూడు వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది.  ఉమేశ్​​కు ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ దక్కింది. 

కేకేఆర్‌‌‌‌ ఈజీగా..

చిన్న టార్గెట్‌‌‌‌ను కోల్‌‌‌‌కతా ఈజీగా ఛేజ్‌‌‌‌ చేసింది. ఓపెనర్లు అజింక్యా రహానె, వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (16) తొలి వికెట్‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌తో మంచి ఆరంభం అందించారు. తనకు వైస్‌‌‌‌ కెప్టెన్సీ అప్పగించిన టీమ్‌‌‌‌ నమ్మకాన్ని రహానె నిలబెట్టాడు.  పవర్‌‌‌‌ప్లేను సద్వినియోగం చేసుకొని మంచి డ్రైవ్స్‌‌‌‌తో బౌండ్రీలు రాబట్టాడు. మిల్నే (0/19) వేసిన నాలుగో ఓవర్లో ఫోర్‌‌‌‌ కొట్టిన తను షార్ట్‌‌‌‌బాల్‌‌‌‌ను పుల్‌‌‌‌ షాట్‌‌‌‌తో సిక్స్‌‌‌‌గా మలచి ఆకట్టుకున్నాడు. ఆపై, తుషార్‌‌‌‌ (0/23) బౌలింగ్‌‌‌‌లో రహానె, వెంకటేశ్‌‌‌‌ చెరో ఫోర్‌‌‌‌ కొట్టగా.. పవర్‌‌‌‌ ప్లేలో కేకేఆర్‌‌‌‌ 43/0 స్కోరు చేసింది. అయితే, ఏడో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన బ్రావో వేసిన ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌కు వెంకటేశ్‌‌‌‌ భారీ షాట్‌‌‌‌కు ట్రై చేయగా.. ఎడ్జ్‌‌‌‌ తీసుకొని కీపర్‌‌‌‌ ధోనీ చేతిలో పడింది. ఇక, వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన నితీశ్‌‌‌‌ రాణా (21) దూకుడుగా ఆడాడు. దూబే (0/11) బౌలింగ్‌‌‌‌లో రెండు ఫోర్లు, శాంట్నర్‌‌‌‌ (1/31) ఓవర్లో సిక్స్‌‌‌‌ కొట్టాడు. అయితే, పదో ఓవర్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు బ్రావో అతడిని ఔట్‌‌‌‌ చేయగా.. ఫిఫ్టీకి చేరువైన రహానెను 12వ ఓవర్లో శాంట్నర్‌‌‌‌ వెనక్కుపంపడంతో చెన్నై రేసులోకి వస్తున్నట్టు అనిపించింది. కానీ, కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ ( 20 నాటౌట్‌‌‌‌), సామ్‌‌‌‌ బిల్లింగ్స్‌‌‌‌ (25)  టార్గెట్‌‌‌‌ను కరిగించారు. చివర్లో బిల్లింగ్స్‌‌‌‌ను బ్రావో ఔట్‌‌‌‌ చేసినా... మిల్నే బౌలింగ్‌‌‌‌లో ఫోర్‌‌‌‌తో శ్రేయస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను ముగించాడు. 

ధోనీ ఆ గ్లోవ్స్‌‌‌‌తో...

ఈ మ్యాచ్‌‌లో ధోనీ  కీపింగ్‌‌ గ్లోవ్స్‌‌ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇండియా తరఫున తొలి మ్యాచ్‌‌ ఆడినప్పుడు మహీ ఆరెంజ్ కలర్‌‌ గ్లోవ్స్‌‌ ఉపయోగించాడు. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి గ్లోవ్స్​తో రావడం విశేషం.  

స్కోర్‌‌‌‌బోర్డ్‌‌

చెన్నై: రుతురాజ్‌‌ (సి) రాణా (బి) ఉమేశ్‌‌ 0, కాన్వే (సి) శ్రేయస్‌‌ (బి) ఉమేశ్‌‌ 3, ఊతప్ప (స్టంప్డ్‌‌) జాక్సన్‌‌ (బి) చక్రవర్తి 28, రాయుడు (రనౌట్‌‌) 15, జడేజా (నాటౌట్‌‌) 26, దూబే (సి) నరైన్‌‌ (బి) రసెల్‌‌ 3, ధోనీ (నాటౌట్‌‌) 50; ఎక్స్‌‌ట్రాలు: 6;  మొత్తం: 20 ఓవర్లలో 131/5;  వికెట్ల పతనం: 1–2, 2–28, 3–49, 4–52, 5–61;  బౌలింగ్‌‌: ఉమేశ్‌‌ 4–0–20–2, మావి 4–0–35–0 , చక్రవర్తి 4–0–23–1, నరైన్‌‌ 4–0–15–0, రసెల్‌‌ 4–0–38–1. 

కోల్‌‌కతా:  రహానె (సి) జడేజా (బి) శాంట్నర్‌‌ 44, వెంకటేశ్‌‌ (సి) ధోనీ (బి) బ్రావో 16, రాణా (సి) రాయుడు (బి) బ్రావో 21, శ్రేయస్‌‌  ( నాటౌట్‌‌) 20,  బిల్లింగ్స్‌‌ (సి) తుషార్‌‌ (బి) బ్రావో 25, షెల్డన్‌‌ (నాటౌట్‌‌) 3;  ఎక్స్‌‌ట్రాలు: 4;  మొత్తం:18.3ఓవర్లలో 133/4;   వికెట్ల పతనం: 1–43, 2–76, 3–87, 4–123;  బౌలింగ్‌‌: తుషార్‌‌ 3–0–23–0, మిల్నే 2.3–0–19–0, శాంట్నర్‌‌ 4–0–31–1, బ్రావో 4–0–20–3, దూబే 1–0–11–0, జడేజా 4–0–25–0.