మళ్లీ గెలుపు బాట పట్టిన బెంగళూరు

మళ్లీ గెలుపు బాట పట్టిన బెంగళూరు


ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు బాట పట్టింది. దినేశ్ కార్తీక్ (34 బాల్స్ లో5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 నాటౌట్), మ్యాక్స్ వెల్ (34 బాల్స్ లో 7ఫోర్లు, 2 సిక్సర్లతో 55) ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌కు తోడు బౌలర్లూ సత్తా చాటడంతో శనివారం జరిగిన మ్యాచ్ లో ఆర్‌‌సీబీ 16 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుచేసి లీగ్ లో నాలుగో విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌‌, బ్యాటింగ్‌‌లో ఆరంభంలో బాగానే ఆడినా చివర్లో చేతులెత్తేసిన ఢిల్లీ మూడో ఓటమి ఖాతాలో వేసుకుంది.  మొదట బెంగళూరు 20 ఓవర్లలో 189/5 రన్స్ చేసింది. మ్యాక్సీ, కార్తీక్‌‌ ఫిఫ్టీలతో టీమ్‌‌కు మంచి స్కోరు అందించారు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ (1/27), అక్షర్ (1/29), ఖలీల్ (1/36), కుల్దీప్ (1/46) తలో వికెట్ తీశారు. ఛేజింగ్ లో ఢిల్లీ 173/7 స్కోరే చేసి ఓడింది. వార్నర్ (38 బాల్స్ లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66) ఫిఫ్టీ వృథా అయింది. ఆర్ సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ (3/28), సిరాజ్ (2/31) మెరిశారు.   కార్తీక్​ ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు. 

మ్యాక్సీ, కార్తీక్ ధనాధన్

టాస్ కోల్పోయి  బ్యాటింగ్​కు వచ్చిన  బెంగళూరుకు దెబ్బమీద దెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్‌‌ అనూజ్‌‌ రావత్ (0) డకౌట్ కాగా, తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ (8) పెవిలియన్ చేరాడు. అనంతరం మ్యాక్స్‌‌వెల్, విరాట్ కోహ్లీ (12) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో పవర్ ప్లేలో ఆర్ సీబీ 40/2తో నిలిచింది. తర్వాతి ఓవర్లోనే కోహ్లీని రనౌట్ చేసి  లలిత్  ఆర్‌‌సీబీ  ఇబ్బందుల్లోకి నెట్టాడు.ఈ దశలో మ్యాక్సీ ఒక్కసారిగా గేరు మార్చాడు.  కుల్దీప్ వేసిన 9వ ఓవర్లో 4,6,4,6  విజృంభించాడు. ప్రభు దేశాయ్ (6) ఔటైనా..  11వ ఓవర్లో ఫోర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మ్యాక్స్ వెల్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో షాబాజ్ (32 నాటౌట్), కార్తీక్ జాగ్రత్తగా ఆడారు. కానీ 17వ ఓవర్లో సిక్స్ తో జోరు పెంచిన కార్తీక్.. ముస్తాఫిజుర్ వేసిన 18వ ఓవర్లో 4,4,4,6,6,4తో ఏకంగా 28 రన్స్ పిండుకుని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు టీమ్ స్కోర్ ను 160కి చేర్చాడు. చివరి రెండు ఓవర్లలో 29 రన్స్ రావడంతో ఆర్ సీబీ భారీ స్కోర్ చేయగలిగింది.

వార్నర్ మెరిసినా..

ఛేజింగ్ లో ఢిల్లీకి వార్నర్, పృథ్వీ షా (16) మెరుపు ఇచ్చారు. తొలి ఓవర్లోనే వార్నర్ సిక్స్ తో ఖాతా తెరవగా.. రెండో ఓవర్లో సిక్స్ తో షా టచ్ లోకి వచ్చాడు. ఈ ఇద్దరూ బౌండరీల జోరు చూపించడంతో 4.3 ఓవర్లలోనే స్కోరు ఫిఫ్టీ దాటింది. కానీ తర్వాతి బంతికే పృథ్వీని సిరాజ్ ఔట్ చేశాడు. తర్వాత వార్నర్, మిచెల్ మార్ష్ (13) సింగిల్స్ తీస్తూనే కావాల్సిన రన్ రేట్ పెరగకుండా చూసుకున్నారు. 9వ ఓవర్లో సింగిల్ తో వార్నర్ లీగ్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడటంతో సగం ఓవర్లకు ఢిల్లీ 79/1తో నిలిచింది. 11వ ఓవర్లో 6,4 కొట్టిన వార్నర్ ను తర్వాతి ఓవర్లో హసరంగ ఔట్ చేసి ఆర్ సీబీకి బ్రేక్ ఇచ్చాడు. ఆపైనా ఆర్ సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో స్కోర్ లో వేగం పెరగలేదు. కెప్టెన్‌‌ రిషబ్‌‌ పంత్ (34) తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు బాది జోరు చూపించాడు. కానీ నెమ్మదిగా ఆడిన మార్ష్‌‌తో పాటు పావెల్ (0), లలిత్ (1) వరుసగా పెవిలియన్‌‌ చేరడంతో 15 ఓవర్లలో 115/5తో  ఢిల్లీ కష్టాల్లో పడింది. అప్పటికి ఢిల్లీ విక్టరీకి 30 బాల్స్ లో75 రన్స్ అవసరం. ఈ దశలో 16వ ఓవర్లో శార్దూల్ (17) సిక్స్, పంత్ 6,4 బాది వేగం పెంచారు. కానీ సిరాజ్‌‌ బౌలింగ్‌‌లో కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్‌‌కు పంత్ ఔటవడంతో మ్యాచ్‌‌ ఆర్‌‌సీబీ చేతుల్లోకి వచ్చింది.  చివరి రెండు ఓవర్లలో 34 రన్స్‌‌ అవసరం కాగా... శార్దూల్‌‌, అక్షర్‌‌ (10 నాటౌట్‌‌) ఢిల్లీని గెలిపించలేకపోయారు.