52 రన్స్‌‌‌‌ తేడాతో ముంబైని ఓడించిన  కోల్‌‌‌‌కతా

52 రన్స్‌‌‌‌ తేడాతో ముంబైని ఓడించిన  కోల్‌‌‌‌కతా

నవీ ముంబై: వరుసగా రెండు విజయాల తర్వాత ముంబై ఇండియన్స్​మళ్లీ పాత కథనే రిపీట్​ చేసింది.  స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా (5/10) కెరీర్​ బెస్ట్​ బౌలింగ్‌‌‌‌తో చెలరేగినా, బ్యాటింగ్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (43 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 51) మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో..  ఐపీఎల్​లో ఒక సీజన్​లో తొలిసారి తొమ్మిది ఓటములు మూటగట్టుకుంది. సోమవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 52 రన్స్‌‌‌‌ తేడాతో ముంబైని ఓడించిన  కోల్‌‌‌‌కతా నైట్​ రైడర్స్​ప్లే ఆఫ్స్​ రేసులో నిలిచింది.  టాస్‌‌‌‌ ఓడిన కోల్‌‌‌‌కతా 20 ఓవర్లలో 165/9 స్కోరు చేసింది. వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (24 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43), నితీశ్‌‌‌‌ రాణా (26 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43) మెరుగ్గా ఆడారు. తర్వాత ముంబై 17.3 ఓవర్లలో 113 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఇన్నింగ్స్‌‌‌‌ మొత్తంలో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే  పరిమితమయ్యారు. కమిన్స్‌‌‌‌ 3, రసెల్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. బుమ్రా ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’గా నిలిచాడు.

బుమ్‌‌‌‌.. బుమ్‌‌‌‌.. బుమ్రా

కోల్‌‌‌‌కతా ఇన్నింగ్స్‌‌‌‌లో వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ మెరుపు బ్యాటింగ్‌‌‌‌ను చూస్తే స్కోరు 200లు దాటాల్సింది. కానీ చివర్లో బుమ్రా  సూపర్​ బౌలింగ్​తో  దెబ్బకొట్టాడు.  రెండు, మూడో ఓవర్‌‌‌‌లో అయ్యర్‌‌‌‌ 6, 4, 6తో టచ్‌‌‌‌లోకి రాగా, రహానె (25) ఫోర్‌‌‌‌తో కుదురుకున్నాడు. కానీ ఐదో ఓవర్‌‌‌‌లో 4, 6, తర్వాతి ఓవర్‌‌‌‌లో 4, 6 దంచిన అయ్యర్‌‌‌‌.. నాలుగో బాల్​కు ఔటయ్యాడు. దీంతో ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 60 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఈ దశలో రహానె, నితీశ్‌‌‌‌ రాణా నిలకడ చూపడంతో  సగం ఓవర్లకు కేకేఆర్​ 87/1తో నిలిచింది. 11వ ఓవర్లో రహానెను క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ చేసి కార్తికేయ (2/32) బ్రేక్‌‌‌‌ ఇచ్చినా, లాస్ట్‌‌‌‌ రెండు బాల్స్‌‌‌‌కు రాణా సిక్సర్లు కొట్టాడు.ఆపై,  పొలార్డ్‌‌‌‌ వేసిన 13వ ఓవర్‌‌‌‌లో రాణా 6, 4, 6తో 17 రన్స్‌‌‌‌ రాబట్టాడు. కానీ  తర్వాతి ఓవర్లోనే శ్రేయస్‌‌‌‌ (6) ఔటయ్యాడు. ఈ టైమ్‌‌‌‌లో బుమ్రా కోల్‌‌‌‌కతాకు డబుల్‌‌‌‌ షాక్‌‌‌‌లిచ్చాడు. ఖతర్నాక్​ బాల్స్​తో రాణా, రసెల్‌‌‌‌ (9)  ఔట్‌‌‌‌ చేయడంతో స్కోరు 15 ఓవర్లలో 140/5గా మారింది. రింకూ సింగ్‌‌‌‌ (23 నాటౌట్‌‌‌‌) నిలకడగా ఆడినా.. 18వ ఓవర్​ను మెయిడిన్​ చేసిన బుమ్రా.. షెల్డన్‌‌‌‌ (5), కమిన్స్ (0), నరైన్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేసి దెబ్బకొట్టాడు. 19వ ఓవర్‌‌‌‌లో రింకూ సిక్సర్‌‌‌‌ కొట్టినా, సౌథీ (0) వెనుదిరిగాడు. లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో బుమ్రా ఒక్క పరుగే ఇచ్చాడు. ఓవరాల్‌‌‌‌గా చివరి ఐదు ఓవర్లలో 25 రన్సే వచ్చాయి. 

పెవిలియన్‌‌‌‌కు క్యూ..

టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ముంబైకి మెరుగైన ఆరంభం దక్కలేదు. ఆరో బాల్‌‌‌‌కు రోహిత్‌‌‌‌ (2) ఔట్‌‌‌‌కాగా, ఇషాన్‌‌‌‌ మూడు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అయినా ఐదో ఓవర్‌‌‌‌లో తిలక్‌‌‌‌ వర్మ (6) పెవిలియన్‌‌‌‌కు చేరడంతో ముంబై కష్టాలు మొదలయ్యాయి. తర్వాత రమన్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (12) సింగిల్స్‌‌‌‌కే పరిమితం కావడంతో సగం ఓవర్లకు  ముంబై 66/2 స్కోరు మాత్రమే చేసింది. 11వ ఓవర్‌‌‌‌లో టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ (13) హ్యాట్రిక్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ కొట్టాడు. కానీ 13వ ఓవర్‌‌‌‌లో వరుణ్‌‌‌‌ (1/22)కు వికెట్‌‌‌‌ ఇచ్చుకున్నాడు. ఈ దశలో పొలార్డ్‌‌‌‌ (15) సిక్స్‌‌‌‌తో ఖాతా తెరిచాడు. ఇషాన్‌‌‌‌ 41 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 15వ ఓవర్‌‌‌‌లో కమిన్స్‌‌‌‌ ఇషాన్‌‌‌‌, మురుగన్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేసి ముంబైని దెబ్బతీశాడు. 30 బాల్స్‌‌‌‌లో 64 రన్స్‌‌‌‌ చేయాల్సిన దశలో వరుస ఓవర్లలో కార్తికేయ (3), పొలార్డ్‌‌‌‌, బుమ్రా (0) రనౌటవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. 

సంక్షిప్త స్కోర్లు: కోల్‌‌‌‌కతా: 20 ఓవర్లలో 165/9 (వెంకటేశ్‌‌‌‌ 43, రాణా 43, బుమ్రా 5/10). ముంబై: 17.3 ఓవర్లలో 113/10 (ఇషాన్‌‌‌‌ 51, కమిన్స్‌‌‌‌ 3/22, రసెల్‌‌‌‌ 2/22).