ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు 

ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు 

ముంబై: ఐపీఎల్ పదిహేనో సీజన్ కు సర్వం సిద్ధమవుతోంది. మరో పదకొండు రోజుల్లో ఈ టోర్నీకి తెరలేవనుంది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్–2022 లీగ్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం దీనికి వేదిక కానుంది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా చేరడంతో.. ఈసారి  కప్ కోసం పది జట్లు పోటీపడనున్నాయి. అయితే, ఈసారి ఐపీఎల్ నిబంధనల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆ మేరకు బీసీసీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. డీఆర్ఎస్ రివ్యూలతోపాటు బ్యాట్స్ మెన్ స్రైకింగ్ కు సంబంధించి రూల్స్ మార్చాలని బోర్డు  యోచిస్తున్నట్లు సమాచారం. ఆ కొత్త రూల్స్ ఇవే.. 

  • మ్యాచుకు ముందు ఏదైనా జట్టు కరోనా బారినపడితే.. మ్యాచులో ఆడేందుకు 11 మంది ఆటగాళ్లు లేకపోతే ఏం చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందించారని తెలిసింది. ఇంతకుముందు ఇలాంటి సమస్య తలెత్తితే మ్యాచును రీషెడ్యూల్ చేసేవారు. ఇప్పుడు కూడా రీషెడ్యూల్ చేయడానికి మొగ్గుచూపుతారు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఆ విషయాన్ని ఐపీఎల్ టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్తారు. దీనిపై తుది నిర్ణయం వాళ్లదే. 
  • ప్రతి ఇన్నింగ్స్ లో ఒక్కో జట్టుకు రెండు రివ్యూలు ఇవ్వాలనే ఆలోచన. ఇంతకుముందు వరకు ఒక్కో జట్టుకు ఒక్కో సమీక్ష కోరే వెసులుబాటు మాత్రమే ఉండేంది. దాన్ని ఇప్పుడు రెండుకు పెంచారు. మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తీసుకొచ్చిన కొత్త రూల్.. ఎవరైనా బ్యాట్స్ మన్ క్యాచ్ ఔటైన సందర్భాల్లో.. క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్ చేయాలనే కొత్త నిర్ణయాన్ని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. దాన్ని ఈ సీజన్ లోనే అమలు చేయాలనుకుంటున్నారు.
  • ఇకపై ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ లాంటి కీలక మ్యాచుల్లో ఏదైనా ఫలితం తేలకుండా డ్రాగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. దీంట్లో కూడా రిజల్ట్ రాకపోతే లీగ్ స్టే్జ్ పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న టీమ్ ను విజేతగా ప్రకటిస్తారు. 

మరిన్ని వార్తల కోసం:

రష్యాలో ఫైజర్ పెట్టుబడులు బంద్

వెరైటీగా బిస్కెట్‌‌ టీ కప్పులు