
‘టీ’లో బిస్కెట్స్ ముంచుకు తినడం కామనే. కానీ, ఎప్పుడైనా బిస్కెట్లో టీ ట్రై చేశారా! రెండింటికీ తేడా ఏముంది? అంటారా! అక్కడికే వస్తున్నా.. సాధారణంగా టీలో బిస్కెట్ నంజుకుని తింటారు ఎవరైనా. ఇక్కడ చెప్పేది బిస్కెట్లో టీ పోసుకొని తాగడం గురించి. ఈ ఇంపాజిబుల్ని కూడా పాజిబుల్ చేసి చూపెట్టింది సిద్దిపేటకి చెందిన ఓ స్టార్టప్.
దీన్ని మొదలు పెట్టింది నలుగురు ఫ్రెండ్స్. వెరైటీగా బిస్కెట్ టీ కప్పులు తయారు చేస్తున్నారు వీళ్లు. అంటే బిస్కెట్స్‌తో తయారు చేసిన కప్పులు అన్నమాట.
ప్లాస్టిక్‌కి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ఈ బిస్కెట్ టీ కప్పుల్లో ఎంచక్కా టీ తాగొచ్చు. తరువాత ఆ కప్పుల్ని కరకరా నమిలేయొచ్చు. ఒకవేళ ఈ కప్పుల్ని పడేసినా వారం రోజుల్లో భూమిలో కలిసిపోతాయని చెప్తున్నారు ఈ నలుగురు ఫ్రెండ్స్. ఈ ఐడియా ఎలా తట్టిందని అడిగితే... ‘యూట్యూబ్ చూసి’ అంటున్నారు.
నలుగురిదీ ఒక్కటే కల
ఈ స్టార్టప్ వెనకున్న అఖిల్ కుమార్, శివకుమార్, రమేష్, శివ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లంతా చిన్నప్పట్నించీ కలిసే చదువుకున్నారు. ఊహ తెలిసినప్పట్నించీ ఈ నలుగురూ కన్న కల కూడా ఒకటే. అదే సొంతంగా బిజినెస్ చేయడం. కానీ, డబ్బున్న కుటుంబాలు కావు. దాంతో వీలైనంత తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు. దానికోసం చాలారోజులు రీసెర్చ్ చేశారు. ఆ ప్రాసెస్‌లోనే యూట్యూబ్‌లో బిస్కెట్ టీ కప్పుల తయారీకి సంబంధించిన వీడియో చూశారు.
ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలాగే సిద్దిపేటలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో... టీ స్టాల్స్‌లో కప్పుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూశారు. దాంతో ప్లాస్టిక్ టీ కప్పులకి ఆల్టర్నేట్ ఆప్షన్‌గా బిస్కెట్ టీ కప్పుల్ని మార్చాలనుకున్నారు. కానీ, చేతిలో డబ్బులేదు.
నిజం చేసుకోవడానికి..
ఉద్యోగం చేస్తే నెలనెలా జీతం వస్తుంది. లైఫ్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. కానీ, బిజినెస్ అలా కాదు. ప్రతి అడుగులో రిస్క్ ఉంటుంది. వెనక్కిలాగే మాటలు కూడా ఉంటాయి. అయినా సరే భయపడలేదు వీళ్లు. నమ్మిన దానికోసం ధైర్యంగా నిలబడ్డారు. తమ కలని నిజం చేసుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినా పోరాడారు. తెలిసినవాళ్లందర్నీ సాయం అడిగారు. బ్యాంకులో అప్పు తీసుకున్నారు. అలా నలుగురూ కలిసి15 లక్షలు పోగుచేశారు. వాటిల్లో ఎనిమిది లక్షలుపెట్టి బెంగళూరు నుంచి మిషన్ తీసుకొచ్చారు. సిద్దిపేటలోని రాఘవేంద్రనగర్‌లో ఒక గది అద్దెకు తీసుకొని నాలుగు నెలల కిందట‘శ్రీసిద్ది’ బిస్కెట్ టీ కప్పుల తయారీ మొదలుపెట్టారు. మొదటి రెండు నెలలు అన్ని స్టార్టప్స్లాగానే వీళ్లకీ ఇబ్బందులు వచ్చాయి. కానీ, మెల్లిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం సిద్దిపేటలోని నాలుగు వందల టీ స్టాళ్లతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాలు, గ్రామాలకు కూడా వీళ్లు బిస్కెట్ కప్పులు సప్లయ్ చేస్తున్నారు.
టీ కప్పుల తయారీతో పాటు మార్కెటింగ్, డెలివరీ కూడా వీళ్లే చేస్తుండటంతో లాభాలు బాగానే వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట రెండు వేల బిస్కెట్ టీ కప్పులను తెలంగాణ అసెంబ్లీ క్యాంటిన్‌కి కూడా సప్లయ్ చేశారు వీళ్లు.
టీ కప్పుల తయారీ
టీ తాగిన తరువాత బిస్కెట్ మాదిరిగా ఈ కప్పుల్ని తినొచ్చు. ఐస్‌క్రీం కోన్ షేప్‌లలో ఉండే వీటి తయారీలో మైదా, రాగి, మొక్కజొన్న పిండితో పాటు చక్కెర, తేనె వాడతారు. వాటిన్నింటిని కలిపి చేసిన పిండిని మౌల్డింగ్ మెషిన్లో ఆరు నిమిషాలు ఉంచితే బిస్కెట్ టీ కప్పు రెడీ అవుతుంది. అలా ఒక్కో విడతకు 40 కప్పుల చొప్పున .. గంటకు నాలుగు వందలు.. రోజుకు దాదాపు 4 వేల బిస్కెట్ టీ కప్పులను తయారుచేస్తున్నారు. వీటిని ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బిస్కెట్ టీ కప్పులు విరగకుండా ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి, డెలివరీ చేస్తారు. ఒక్కో కప్పుని టీ స్టాల్స్‌కి 3.50 రూపాయల చొప్పున అమ్ముతున్నారు.
ఈ బిస్కెట్ కప్పుల్లో ‘టీ’ పోస్తే దాదాపు ఇరవై నిమిషాల వరకు చల్లారదు. ఆలోపుగా టీ తాగి తరువాత కప్పులను బిస్కెట్ల మాదిరిగా తినొచ్చు. తిన్న టీ కప్పులు త్వరగా అరిగిపోవడంతో పాటు శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రొటీన్స్‌ని కూడా అందిస్తాయి. ఒకవేళ బిస్కెట్ కప్పుల్ని పడేసినా పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు.
అదే మా గోల్
ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. కానీ, వాటికి బదులుగా వాడడానికి వేరేవి ఏవీ లేకపోవడం వల్ల ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది. దానివల్ల పర్యావరణంతో పాటు మూగ జంతువులు పడుతున్న ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. అందుకే వీటన్నింటికీ పరిష్కారంగా బిస్కెట్ టీ కప్పులు తయారు చేస్తున్నాం. సిద్దిపేటలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడంతో ఈ కప్పులకు మంచి గిరాకీ వస్తోంది. ఫ్యూచర్లో ఈ కప్పుల్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి అనుకుంటున్నాం. ప్లాస్టిక్ కప్పుల్ని ఇవి పూర్తిగా రీప్లేస్ చేస్తాయన్న నమ్మకంతో ఉన్నాం అంటున్నారు ఈ నలుగురు ఫ్రెండ్స్.
::: హెచ్.రఘునందన స్వామి, సిద్దిపేట, వెలుగు