కార్తీక పున్నమి.. పుణ్యాల పున్నమి..జీడికంటి పున్నమి .. ఇంటి ముందు దీపం .... ఎన్నో విశేషాలు..!

కార్తీక పున్నమి.. పుణ్యాల పున్నమి..జీడికంటి పున్నమి ..  ఇంటి ముందు దీపం  ....  ఎన్నో విశేషాలు..!

 ప్రతిమాసంలో మనకు ఏదో ఒక పండుగ ఉంటుంది. అయితే, అన్ని మాసాలకంటే కార్తీకమాసం చాలా ప్రత్యేకమైనది. కార్తీకమాసంలో ప్రతిరోజూ పర్వదినమే. ఈ మాసమంతా పూజలు, ఉపవాసలతో పరమాత్మను కొలుస్తుంటారు. అయితే, ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అన్నింటికంటే పవిత్రమైనది. 

శివుడు, విష్ణువు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పౌర్ణమి, త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అందుకే, ఈ నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తీక పౌర్ణమినాడు చేసే పూజకు ఎక్కువ ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. మన తెలంగాణలో 'జీడికంటి పున్నమి'గా జరుపుకునే ఈ పండుగకి ఎన్నో విశేషాలు ఉన్నాయి.

కార్తికేయుడు పుట్టిన కృత్తిక నక్షత్రంలోనే   కార్తీక పౌర్ణమి వస్తుంది. వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుడ్ని చంపడానికి శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ కార్తీక పౌర్ణమినాడే. యోగసిద్ధులైన గోపికలను శ్రీకృష్ణుడు అనుగ్రహించిన శుభదినం కూడా కార్తీక పౌర్ణమే. అందుకే, ఈ రోజు చాలాచోట్ల ఘనంగా 'రాసలీలా మహాత్సవం' జరుపుతారు. 

శివుడు త్రిపురాసురుడ్ని చంపింది కూడా ఈ రోజే! క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన విషాన్ని మింగి శివుడు ఈ లోకాన్ని రక్షించింది కూడా ఈ పౌర్ణమినాడే అని పురాణాలు చెప్తున్నాయి. ఈ శుభ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శివాలయాల్లో జ్వాలాతోరణ మహోత్సవాలు జరుపుతారు. మంచి జరగాలని కోరుతూ జ్వాలా తోరణాలు వెలిగిస్తారు. అలాగే, శివుడి శరీరంలో సగభాగం ఉండాలని కోరుకుంటుంది పార్వతి దానికోసం కఠోర తపస్సు చేస్తుంది. 

పార్వతి తపస్సును మెచ్చి.. కార్తీక పౌర్ణమినాడే అర్థనారీశ్వరుడిగా అవతరిస్తాడు. అందుకే, ఈ రోజు చాలామంది శివుడిని అర్ధనారీశ్వరుడి రూపంలో కొలుస్తుంటారు. ఇలా శివుడు, విష్ణువు ఇద్దరికీ కార్తీకమాసం ఇష్టమైన మాసంగా మారిపోయింది. అందుకే, ఈ రోజు శివకేశవులను ఒకేసారి కొలిస్తే ముక్తి లభిస్తుందని చెప్తారు.

ఇంటిముందు దీపం..

కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుడిని కొలవాలని పెద్దలు చెప్తారు. ఇలా చేయడం వల్ల ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో, ప్రశాంతంగా ఉంటారని నమ్మకం. ఈ పౌర్ణమిని వైకుంఠ పౌర్ణమి అని, తెలంగాణలో కొన్నిచోట్ల జీడికంటి పున్నమి అని పిలుస్తారు. ఈ పున్నమినాడు ఇంటిముందు దీపాలు వెలిగిస్తారు. ఇలా దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుందని నమ్మకం. తర్వాత కొబ్బరికాయ కొట్టి రకరకాల ప్రసాదాలు తయారు చేస్తారు. 'జీడికంటి ఫలారముల్లో' అని అరుస్తూ వచ్చిన వాళ్లందరికీ ప్రసాదం పంచుతారు. ఊళ్లల్లో పిల్లలు ఇంటింటికి తిరిగి ఈ ప్రసాదాలు తెచ్చుకొని తింటూ సంతోషంతో గంతులేస్తారు. అలాగే, దీపావళిరోజు నోముకోని వాళ్లు... కార్తీక పౌర్ణమినాడు నోముకుంటారు.

►ALSO READ | మరికొన్ని గంటల్లో కార్తీక పౌర్ణమి : శివ కేశవులకు ఇష్టమైన రోజు మనం ఏం చేయాలంటే..!

జ్ఞానం.. దానం...


పౌర్ణమి నాడు చంద్రుడు నిండుగా మారుతాడు. చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్టే మన మనసు కూడా జ్ఞానపూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి ఇచ్చే సందేశం. ఈ రోజు దీపదానం చేస్తే పాపాలు తొలగి, మోక్షం కలుగుతుందని పురాణాల్లో ఉంది. ఈ రోజు సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల పాపాలు నశిస్తాయని చెప్తారు. ఈ పౌర్ణమినాడు గంగా, గోదావరిలాంటి పవిత్ర నదుల్లో కార్తీక దీపాలను వదులుతారు. ఏడా దంతా దీపం పెడితే కలిగే పుణ్యం మొత్తం.. కార్తీక పౌర్ణమి ఒక్కనాడు పెడితే లభిస్తుందని అంటారు

దీపం చెప్పే తత్వం

కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఉసిరి కాయపైన ఒత్తులు పెట్టి వెలిగించి ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందని అంటారు. పౌర్ణమి రోజున అరటి ఆకు మీద దీపాన్ని వెలిగించి నదిలో వదిలితే శుభం కలుగుతుందని నమ్మకం. దీపానికి ఎంతో విశిష్టత ఉంది. దీపాన్ని సాక్షాత్తు భగవంతుడి స్వరూపంగా భావిస్తారు. ప్రమిదల్లో ఉంచే ఒత్తిని శరీరంగా, జ్వాలను ప్రాణంగా, నూనెను కర్మఫలమని చెప్తారు. నూనె అనే కర్మఫలం ఉన్నంత వరకే ఒత్తి అనే శరీరంలో జ్వాల అనే ప్రాణం ఉంటుం దన్నది ఈ దీపం చెప్పే జీవిత సత్యం.. 

వెలుగు,లైఫ్​