రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎమోషనల్ ప్రాజెక్ట్ "స్పిరిట్" రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. దాదాపు రెండేళ్ల క్రితమే అధికారిక ప్రకటన వచ్చినా.. ప్రభాస్ వరుస కమిట్‌మెంట్స్ కారణంగా ఈ చిత్రం ఆలస్యమైంది . ఇప్పుడు సింపుల్‌గా పూజా కార్యక్రమం జరుపుకుని సెట్స్‌పైకి వెళ్లిందని సమాచారం. ఈ సందర్భంగా విడుదలైన అప్‌డేట్‌లు అంచనాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చాయి.
కొరియన్ స్టార్ డాన్ లీ ఎంట్రీ!
"స్పిరిట్" ప్రాజెక్ట్‌కు మరో ఇంటర్నేషనల్ టచ్ జోడైంది. కొద్దికాలంగా ప్రచారంలో ఉన్నట్టుగానే ప్రముఖ కొరియన్-అమెరికన్ నటుడు మా డాంగ్-సియోక్ (డాన్ లీ) ఈ సినిమాలో నటించబోతున్నట్టు అధికారికంగా ధృవీకరణ లభించింది. 'ట్రైన్ టు బుసాన్', 'ఎటర్నల్స్' వంటి గ్లోబల్ హిట్స్‌తో పాపులర్ అయిన డాన్ లీ.. స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా "కొత్త ప్రయాణం ఈ రోజు మొదలైంది. #Spirit" అంటూ పోస్ట్ చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.
డాన్ లీ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రభాస్ వంటి మాస్ హీరోకు, డాన్ లీ వంటి అంతర్జాతీయ యాక్షన్ స్టార్‌ను విలన్‌గా ఎంచుకోవడం.. ఈ చిత్రాన్ని కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాక, ఇంటర్నేషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా నిలబెట్టాలన్న సందీప్ రెడ్డి వంగా ఉన్నట్లు స్పష్టం చేస్తోంది.
New Journey Started today 😇#Spirit pic.twitter.com/4BE2NmeooY
— Don Lee (@MaaDongSeok) November 4, 2025
ప్రభాస్ మాస్ పోలీస్ యాక్షన్
'స్పిరిట్' చిత్రం పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఆడియో గ్లింప్స్‌లో, ప్రభాస్ పాత్ర 'నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది' అంటూ చెప్పే డైలాగ్.. అతని క్యారెక్టర్‌లోని ధిక్కార స్వభావాన్ని, మాస్ ఎలివేషన్‌ను సూచించింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు సమాచారం. షూటింగ్ కోసం మెక్సికో వంటి అంతర్జాతీయ ప్రాంతాలను కూడా పరిశీలించినట్టు సందీప్ వంగా గతంలో తెలిపారు.
ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అంటేనే మాస్ ఎమోషన్స్, ఊహించని ట్విస్టుల ఫుల్ ప్యాకేజీ. ఈ ప్రాజెక్ట్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభం కావడంతో, రాబోయే బాక్సాఫీస్ రికార్డులు అన్నీ ప్రభాస్ ఖాతాలో పడటం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
