RGV-Nagarjuna: 'శివ' 4K ట్రైలర్ విడుదల.. టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు..!

RGV-Nagarjuna: 'శివ' 4K ట్రైలర్ విడుదల.. టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు..!

తెలుగు సినీ చరిత్రలో ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చిన చిత్రం 'శివ'.  కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఈ మూవీ 1989లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు నమోదు చేసింది.  ఈ సినిమా తోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇప్పుడు మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి  50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా ఈ కల్ట్ మూవీ శివను నవంబర్ 14న థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు.  ఈ సందర్భంగా శివ 4K ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .

ఈ మూవీతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిభకు, నాగార్జునలోని సరికొత్త నటుడికి ఇది ఒక వేదికగా నిలిచింది. ముఖ్యంగా, కాలేజీ రాజకీయాలు, గ్యాంగ్ వార్లను వాస్తవికతకు దగ్గరగా చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో  శివ సైకిల్ చైన్‌ వంటి సాధారణ వస్తువులను పోరాట సన్నివేశాలకు ఉపయోగించి వర్మ అప్పటి ఫార్ములా సినిమాల నుంచి బయటపడి కొత్త ట్రెండ్ సృష్టించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని కొత్త తరహా కథాంశాన్ని, టేకింగ్‌ను పరిచయం చేసింది.

ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కథల ఎంపిక, దర్శకత్వ శైలిలో గణనీయమైన మార్పు వచ్చింది. 'శివ'కు ముందు, 'శివ' తర్వాత అనేంతగా ఈ సినిమా ప్రభావం చూపించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. కల్ట్ క్లాసిక్ చిత్రంగా ఎప్పటికీ నిలిచిపోయే ఈ సినిమా ఇప్పుడు మరింత మెరుగైన సాంకేతికతతో 4Kతో మళ్లీ ప్రేక్షకులను అలరించనుంది.  ట్రైలర్ విడుదల సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌, హీరోలు శివ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా శివ అంటూ పలవురు స్టార్స్ కామెంట్స్ చేశారు.. ఇప్పుడుఈ ఐకానిక్ మూవీ రీరిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.