ఐపీఎల్ 2023 ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్..! సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..

 ఐపీఎల్ 2023 ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్..! సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..

చెన్నై సూపర్ కింగ్స్..ఐపీఎల్ రారాజు అనొచ్చు. ఎందుకంటే ఐపీఎల్లో మెరుగైన రికార్డు ఏ జట్టుకైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్ కే.  2020, 2022 సీజన్లలో తప్ప..దాదాపు మిగతా  ఐపీఎల్ సీజన్లలో ధోనిసేన అద్భుతంగా ఆడింది. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లోనూ ధోనిసేన రెండో స్థానంతో ప్లేఆఫ్ చేరింది. మరోసారి టైటిల్ ఫైట్ లో తుది దశకు అర్హత సాధించింది. ప్లేఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్..మే 24న గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై వేదికగా జరిగే క్వాలిఫయర్-1లో  తలపడనుంది.

సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా..

ఐపీఎల్లో  క్వాలిఫికేషన్ రౌండ్స్ ప్రవేశపెట్టిన 2011 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్  పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలుస్తూ  ఫైనల్ చేరుతోంది. ఇది  గత 13 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ సారి కూడా ధోనిసేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి చెన్నై ఫైనల్ చేరుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఆ  సెంటిమెంట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. 

రెండో స్థానంలో నిలిస్తే ఫైనలే..

2011 ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో ధోనిసేన రెండో స్థానంలో నిలిచింది. అదే సీజన్లో ఫైనల్ చేరింది. ఇక  2012లో కోల్కతా రెండో స్థానంలో నిలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది. 2013లో  ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు వెళ్లింది. 2014 మరోసారి  కేకేఆర్ సెకండ్ ప్లేస్ లో నిలిచి ఫైనల్ దూసుకెళ్లింది.  2015లో ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్ లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.  2016 లో  ఆర్‌సీబీ, 2017 లో  రైజింగ్ పుణే, 2018, 19 ఐపీఎల్ సీజన్లలో  చెన్నై, 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2021లో చెన్నై, 2022లో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో నిలిచి టైటిల్ ఫైట్ లో నిలిచాయి. 

పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో టైటిల్ 

లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన మూడుసార్లు  చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సొంతం చేసుకుంది.  2011, 2018, 2021 మూడు సీజన్లలో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరి ఛాంపియన్ గా అవతరించింది. 2012, 2014లో కోల్ కతా నైట్ రైడర్స్ ..2013. 2015లో ముంబై ఇండియన్స్ జట్లు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ఐపీఎల్ టైటిల్ సాధించాయి. ఈ సెంటిమెంట్ రీపిట్ అయితే మరోసారి ధోనీ సేన ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవనుంది. 

చెన్నై రికార్డు..

ఐపీఎల్ మొదటి సీజన్ 2008లో చెన్నై  రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత సీజన్ 2009లో సెమీఫైనల్లో ఓడిపోయింది. 2010, 2011లో టైటిల్ ఎగరేసుకుపోయింది. మళ్లీ 2011, 2012లో రన్నరప్‌గా నిలిచిన చెన్నై... 2014లో ప్లే ఆఫ్స్‌లోనే వెనుదిరిగింది. 2015లో మరోసారి రన్నరప్‌గా నిలిచిన ధోనిసేన..2018లో ఛాంపియన్ గా మారింంది. 2019లో మరోసారి రన్నరప్‌గా నిలిచిన సీఎస్‌కే 2021లో టైటిల్ దక్కించుకుంది. మొత్తంగా 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో  రెండేళ్ల పాటు నిషేధంతో దూరమైన చెన్నై సూపర్ కింగ్స్..14 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. 2020, 2022 సీజన్లలోనే లీగ్ దశలోనే నిష్క్రమించింది.