SRH vs KKR: ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం ముప్పు? రద్దయితే ట్రోఫీ ఎవరికి..?

SRH vs KKR: ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం ముప్పు? రద్దయితే ట్రోఫీ ఎవరికి..?

గత రెండు నెలలుగా మండు టెండల్లో అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతూ వచ్చిన ఐపీఎల్‌ 17వ సీజన్ తుది అంకానికి చేరుకుంది క్యాష్ రిచ్ లీగ్‌లో నేడు ఆఖరి సమరం జరగనుంది. లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్లుగా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు టైటిల్‌ పోరులో తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇదిలావుంటే, తది పోరుకు వర్షం ముప్పు పొంచిఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. 

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది. ఆదివారం(మే 26) అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో.. సముద్రతీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కోల్‌కతాలో పలు విమానాలు రద్దవ్వగా.. తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ తుఫాన్ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై కొంతమేర ప్రభావం చూపుతోంది. శనివారం చెన్నైలో ఆకస్మిక వర్షం కురవడంతో కోల్‌కతా తమ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకుంది.

ఆకాశం మేఘావృతం

ఆకాశం మేఘావృతం అయినప్పటికీ.. ప్రస్తుతం చెన్నైలో వర్షం పడుతున్న ఆనవాళ్లు లేవు. వాతావరణ శాఖ సైతం అదే స్పష్టం చేసింది. ఆదివారం (మే 26) వర్షం పడే అవకాశాలు లేవని తెలిపింది. అక్యూవెదర్ ప్రకారం.. ఆదివారం చెన్నైలో వర్షం కురిసే అవకాశం 4 శాతం మాత్రమే. అయితే హఠాత్తుగా వర్షం కురిస్తే మాత్రం కొట్టి పారేయలేం. ఇప్పటికే క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఇదే వేదికపై జరగ్గా.. ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయింది. ఫైనల్ కూడా అలానే ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని తెలుగు అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

రద్దయితే కోల్‌కతాదే ట్రోఫీ

ఒకవేళ ఫైనల్ పోరుకు వర్షం ఆటంకం కలిగిస్తే 120 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. ఆ సమయంలోపు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అంతకూ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే(మే 27) రోజు నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే సాధ్యం కాకపోతే లీగ్ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన కేకేఆర్ ట్రోఫీ ఎగరేసుకుపోతుంది. కాగా, గత సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌కు వర్షం అడ్డుపడటంతో మరుసటి రోజు మ్యాచ్ నిర్వహించారు.