MI vs CSK: హై ఓల్టేజ్ వార్.. నేడు ముంబైతో చెన్నై ఢీ

MI vs CSK: హై ఓల్టేజ్ వార్.. నేడు ముంబైతో  చెన్నై ఢీ

ఐపీఎల్ 2024లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం ముంబై జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ కోసం అటు ముంబై ఫ్యాన్స్, ఇటు చెన్నై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాంఖడే స్టేడియం వేదికగా సాయంత్రం  7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.  ఈ సీజన్ లో ఇప్పటివరకు ఇరుజట్లు ఐదేసి మ్యాచ్ లు ఆడాయి. ఇందులో చెన్నై మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇక, ఓటమితో టోర్నీని ప్రారభించిన ముంబై.. తొలి మూడు మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఆ తర్వాత గేర్ మార్చిన ముంబై.. చివరి రెండు మ్యాచ్ ల్లో అద్భుత ప్రదర్శనతో భారీ విజయాలను సొంతం చేసుకుని ఫుల్ జోష్ లో కనిపిస్తోంది.

ముంబైకి ప్రధాన బలం వారి బ్యాటింగ్. జట్టులో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక  పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షఫెర్డ్ వంటి హిట్టర్లు ఉన్నారు. వీరంతా చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. ఇక బౌలింగ్ లో బుమ్రా తప్ప మిగతావారు పెద్దగా రాణించకపోవడం ముంబైకి మైనస్ గా మారింది.

ఇక, చెన్నై బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా కనిపిస్తోంది. ఈ జట్టులోనూ డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ లు చెలరేగితే చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయం. బౌలింగ్ లో మహేష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే,రవీంద్ర జడేజా, ముస్తాఫిజుర్ రెహమాన్ మంచి ఫామ్ లో ఉండడం చెన్నైకి కలిసోచ్చే అంశం.  కాకపోతే, చెన్నై బ్యాటింగ్ తో పోలిస్తే ముంబై బలంగా ఉంది. ఈక్రమంలో ఇరుజట్ల మధ్య జరుగబోయే పోరులో ఎవరు గెలుస్తారోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

కాగా,  ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో ముంబైదే పై చెయి.  ఐపీఎల్ లో ఇరుజట్లు మొత్తం 38 సార్లు పోటీ పడగా..ముంబై 21 సార్లు గెలవగా.. చెన్నై  17సార్లు గెలుపొందింది. ఇక, వాంఖడే స్టేడియంలో 11సార్లు తలపడగా.. ముంబై 7 మ్యాచ్ ల్లో, చెన్నై 4 మ్యాచ్ ల్లో విజయం సాధించాయి.

వాంఖడే పిచ్

వాంఖడే స్టేడియం ఎక్కువగా బౌలింగ్ కంటే బ్యాటింగ్ కే అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీ లైన్ ఉండడంతో భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మంచు ప్రభావం కారణంగా సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఈ పిచ్ సహకరిస్తుంది. అందువల్ల టాస్ గెలిచిన జట్టు సాధారణంగా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటుంది.

ఇరుజట్ల అంచనా:

ముంబై ఇండియన్స్ (MI):


రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా

ఇంపాక్ట్ ప్లేయర్:  ఆకాష్ మధ్వల్

చెన్నై సూపర్ కింగ్స్ (CSK):

రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (c), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (WK), శార్దూల్ ఠాకూర్, మహేష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్:  శివమ్ దూబే