
- దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని బీసీసీఐ ప్రకటన
- మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలు తర్వాత ప్రకటిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: వేసవిలో హోరాహోరీ పోరాటాలతో అభిమానులకు వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌కు బ్రేక్ పడింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో మెగా లీగ్‌ను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర విషయాలకంటే దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని బీసీసీఐ స్పష్టం చేసింది. గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధంతరంగా నిలిపివేయడంతో మెగా లీగ్ కొనసాగడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఐపీఎల్2025 మిగిలిన మ్యాచ్‌లను తక్షణమే ఒక వారం పాటు నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది’ అని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ బోర్డు ఒక వారమే అని స్పష్టత ఇచ్చింది.
‘సంబంధిత అధికారులు, స్టేక్‌హోల్డర్లతో పరిస్థితులను పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత కొత్త షెడ్యూల్, వేదికల గురించి తదుపరి ప్రకటనలు చేస్తాం. ఈ కీలక సమయంలో బీసీసీఐ దేశం పక్షాన నిలుస్తుంది. భారత ప్రభుత్వం, సైన్యం, దేశ ప్రజలకు సంఘీభావం తెలుపుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చూపిన ధైర్యం, నిస్వార్థ సేవకు గాను భారత సాయుధ దళాలకు బీసీసీఐ సెల్యూట్ చేస్తోంది ’ బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. మన దేశాన్ని రక్షించే అన్ని ప్రయత్నాలకు, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలకు బోర్డు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలను అన్నిటికంటే ముందు ఉంచినందుకు అధికారిక బ్రాడ్‌కాస్టర్, స్పాన్సర్లకు బోర్డు ధన్యవాదాలు తెలిపింది.
మిగిలింది 16 మ్యాచ్‌లా...17 మ్యాచ్‌లా?
మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసిన ఐపీఎల్18వ సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇందులో 12 లీగ్ మ్యాచ్‌లు కాగా.. నాలుగు ప్లేఆఫ్స్ దశవి. గురువారం పంజాబ్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ పోరుమధ్యలోనే నిలిపివేసినా.. ఇరు జట్లకూ పాయింట్లు కే టాయించలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను తిరిగి నిర్వహిస్తారా? లేదా ఇరు జట్లకూ చెరో పాయింట కేటాయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
ఆటగాళ్ల తిరుగు ప్రయాణం..
బీసీసీఐ సెక్రటరీ సైకియా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ సీనియర్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఐపీఎల్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత వాతావరణంలో ఆటను కొనసాగించడం సముచితం కాదని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని తెలుస్తోంది. మధ్యాహ్నం 2.40 గంటలకు ఈ ప్రకటన చేయడానికి ముందే అన్ని ఫ్రాంచైజీలకు వాయిదా గురించి సమాచారం అందింది. ధర్మశాలలో ఉన్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ప్లేయర్లు, సిబ్బంది మొత్తం 40 మందిని చిన్న చిన్న వాహనాల్లో భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన జలంధర్‌కు తరలించారు. అక్కడి నుంచి వాళ్లు రైల్లో ఢిల్లీకి పయణం అయ్యారు. ఇతర ఫ్రాంచైజీలు కూడా తమ ప్లేయర్లను వారి స్వస్థలాలకు చేరుస్తున్నాయి.
టికెట్ల పైసలు వాపస్
లీగ్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి ఆయా ఫ్రాంచైజీలు కూడా మద్దతు ప్రకటించాయి. ‘దేశమే తొలి ప్రాధాన్యత’ అంటూ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెడుతున్నాయి. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి
రీఫండ్ ఇస్తామని సన్ రైజర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆగడం తొలిసారి కాదు
18 ఏండ్ల ఐపీఎల్ చరిత్రలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, సైనిక చర్య కారణంగా లీగ్‌కు ఆటకం కలగడం ఇదే తొలిసారి. అయితే, ఐపీఎల్ ఆగిపోవడం మాత్రం ఇది మొదటి సారి కాదు. 2009లో ఎలక్షన్స్ కారణంగా మొత్తం లీగ్‌ను సౌతాఫ్రికాకు షిష్ట్ చేశారు. కరోనా కారణంగా ఏప్రిల్–మే విండోలో ఐపీఎల్ సాధ్యం కాకపోవడంతో 2020లో సెప్టెంబర్‌లో యూఈఏలో టోర్నీని నిర్వహించారు. ఆ తర్వాతి ఏడాది ఇండియాలో బయో బబుల్‌లో లీగ్‌ను మొదట్టినా.. ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఆట మధ్యలో ఆగింది. చివరకు సెప్టెంబర్‌లో యూఏఈలోనే ఆటను పూర్తి చేశారు.
ఫారిన్ క్రికెటర్లలో బుగులు
ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతున్న ఫారిన్ ప్లేయర్లు ఎక్కువగా భయపడుతున్నారు. తమ భద్రతపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు లీగ్, బోర్గు వర్గాలు చెబుతున్నాయి. గతేడాది జరిగిన వేలంలో పది ఫ్రాంచైజీలు కలిపి 62 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ప్రస్తుతం ఆటగాళ్లు తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఆయా జట్లతో ఉన్నారు. వీళ్లకు తోడు పలువురు కోచింగ్ సిబ్బంది, లీగ్‌తో భాగమైన కామెంటేటర్లు, బ్రాడ్‌కాస్టింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు. ఫారిన్ ప్లేయర్లు ఒకటి రెండు రోజుల్లో వారి స్వదేశాలకు చేరవేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఐపీఎల్, పీఎస్‌ఎల్‌లో తమ దేశ ప్లేయర్లు ఆడుతున్న నేపథ్యంలో ఇరు దేశాల్లో పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. రెండు లీగ్స్‌లో భాగమైన తమ క్రికెటర్ల భద్రతపై న్యూజిలాండ్ క్రికెటర్ల అసోసియేషన్, క్రికెట్ వెస్టిండీస్ ఆందోళన వ్యక్తం చేశాయి.